అసెంబ్లీ సమావేశాల విషయంలో గవర్నర్ ఏం చెప్పినా సరే ప్రభుత్వం అంగీకరిస్తోంది. చివరికి ప్రభుత్వం తరపున గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించాల్సిన ప్రసంగ పాఠాన్ని కూడా గవర్నర్ మార్చమంటే.. మార్చేస్తాం అని మారు మాట్లాడకుండా హామీ ఇచ్చి మారుస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పెట్టకూడదని.. గత సమావేశాలకు పొడిగింపు అని ప్రకటించారు. తర్వాత సీన్ మారిపోవడంతో గవర్నర్ తో అదే నోటిఫికేషన్ ఇప్పించారు.
ఇప్పుడు గవర్నర్ ప్రసంగించాలి కాబట్టి ప్రసంగ పాఠాన్ని ముందుగానే అధికారులు గవర్నర్ కు పంపారు. ఈ ప్రసంగంలో గవర్నర్ పలు మార్పులు సూచించారు వాస్తవాలకు దగ్గరగా ఉండాలని ప్రశాంత్ రెడ్డికి గవర్నర్ సూచించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ సూచనలకు ఒకే చెప్పిన మంత్రి ప్రశాంత్ రెడ్డి మార్పులు చేయడానికి అంగీకరించారు. ఉన్న వాస్తవాలనే ప్రసంగంలో ఉంటాయని శాసనసభ వ్యవహారాల మంత్రి హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 3వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.
గవర్నర్ ప్రసంగం సహజంగా కేబినెట్ ఆమోదించినదే ఉండాలి. కానీ ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో అని టీఆర్ఎస్ సర్కార్ కంగారు పడుతోంది. అందుకే..ఆమె అడిగిన మార్పులు చేసేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. అయితే గవర్నర్ పై నిన్నటి వరకూ ఇంత తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బీఆర్ఎస్ చీఫ్.. ఒక్క సారిగా ఇలా సరెండర్ అయినట్లుగా వ్యవహరించడం మాత్రం.. అనేక రకాల చర్చలకు కారణం అవుతోంది.