ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ ప్రజా సంక్షేమానికే తమ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని అవకాశం దొరికినపుడల్లా గట్టిగా చెప్పుకొంటూనే ఉంటారు. కానీ ఆచరణలో జరుగుతున్నది మాత్రం వేరేగా కనబడుతోంది. మారు మూల గ్రామాలలో ప్రజలు అనారోగ్యం పాలయితే జిల్లా కేంద్రాలలో ఉన్న ప్రభుత్వాసుపత్రులకు రావడం కశామనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గ్రామాలు, మండల కేంద్రాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించింది. వాటిలో సాధారణ వైద్యసేవలు మొదలుకొని ప్రసూతీ సేవల వరకు చాలా వైద్య సేవలు అందిస్తారు. ఒక్కోప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఒక వైద్యుడు, ఏ.ఎన్.ఎం.నర్స్ అందుబాటులో ఉంటారు. పట్టణాలలో ఏర్పాటు చేసిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మరి కొందరు అదనపు సిబ్బంది ఉంటారు. తెలంగాణా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో 685 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో 177 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంపై ప్రభుత్వం నెలకు రూ.2లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
అయినా చాలా వైద్య కేంద్రాలలో వైద్య సేవలు సంతృప్తికరంగా లేవని పిర్యాదులు అందుతుండటంతో, ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేసేందుకు సంసిద్ధం అయ్యింది. ఆ ప్రయత్నంలో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ‘ఈ-వైద్య’ అనే సంస్థకి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ సంస్థకు రెండు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను అప్పగించింది. ఆ సంస్థ సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లయితే రెండు రాష్ట్రాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ డానికే అప్పగించే అవకాశం ఉంటుంది. 104 మొబైల్ వైద్య సేవలను కూడా త్వరలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామాలలో నివసించే పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే సత్సంకల్పంతో గతః ప్రభుత్వాలు ఈ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసాయి. కానీ ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నామని చెప్పుకొనే ప్రస్తుత ప్రభుత్వాలు వాటిని ప్రైవేట్ పరం చేయబోతున్నాయి. ప్రజలకు మెరుగయిన సేవలు అందించడానికే అటువంటి ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకోవచ్చును. కానీ ప్రైవేట్ సంస్థలు చేతిలో పడిన తరువాత అవి పేద ప్రజల నుండి డబ్బుని పిండుకోవడమే కాకుండా నగరాలలో కార్పోరేట్ ఆసుపత్రులకు బ్రోకర్స్ లాగ మారి పేద ప్రజలను అక్కడికి తరలించడం మొదలుపెడతాయి. ఇప్పటికే మారుమూల గ్రామాలలో పనిచేస్తున్న కొందరు ఆర్.ఎం.పి.లు చిన్న చిన్న క్లినిక్ నడుపుకొనే వారు కార్పోరేట్ ఆసుపత్రులకు ఏజంట్లుగా మారిపోయారు. ఇక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ సంస్థల చేతులలోకి వెళ్ళినట్లయితే అవి నగరాలలో కార్పోరేట్ ఆసుపత్రులకు రోగులను సప్లై చేసే ఏజన్సీలుగా మారే అవకాశం ఉంది. ఏమంటే ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేయడం లేదు కనుక ఆసుపత్రిలో వైద్య సేవలు, మందులు అందించలేకపోతున్నామని చెప్పుకొనే వెసులుబాటు ఉంటుంది. ప్రజా సంక్షేమం కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వాలు ఒక్కో బాధ్యత నుండి క్రమంగా తప్పుకోవాలని ప్రయత్నించడం చాలా దురదృష్టం.