హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం స్లంప్కు హైడ్రా కూడా ఓ కారణం. హైడ్రా మాత్రమే కారణం కాకపోవచ్చు. దేశమంతటా రియల్ ఎస్టేట్ స్లంప్లోనే ఉందని .. హైదరాబాద్లో కూడా అలాగే ఉందని ప్రత్యేకంగా హైడ్రా కారణం కాదని సీఎం రేవంత్ చెబుతున్నారు. పూర్తిగా హైడ్రా కారణం కాకపోవచ్చు కానీ అది కూడా ఓ కారణం. ఇంటి కొనుగోలుకు అడ్వాన్సులు ఇచ్చిన చాలా మంది మిగిలిన పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఎవరూ ముందుకు రావడం లేదు.
హైడ్రా తర్వాత చేపట్టబోయే చర్యల ద్వారానే ఎక్కువ రియల్ ఎస్టేట్ ప్రభావితం కానుంది. దీంతో హైడ్రాకు చట్టబద్దత వచ్చినా… కోర్టుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా బుల్ డోజర్లు మాత్రం ముందుకు కదలడం లేదు. అదే సమయంలో ప్రభుత్వం అనుమతులు ఉన్న ఏ ప్రాజెక్టు జోలికి వెళ్లబోమని గట్టిగా చెబుతోంది. ఈ నమ్మకం కలిగించడానికి హైడ్రా కార్యకలాపాల్ని పరిమితం చేశారన్న భావన వినిపిస్తోంది. రంగనాథ్ కూడా దూకుడైన ప్రకటనలు చేయడం లేదు.
ముందుగా హైడ్రా అడ్డగోలు కూల్చివేతలు చేపట్టదన్న నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించినప్పుడు ప్రశంసలు వచ్చాయి. రాష్ట్రం మొత్తం హైడ్రా ఉండాలి అని అన్నారు. అయితే ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన కొన్ని ఇళ్లను అమీన్ పూర్, కిష్టారెడ్డి పేట ప్రాంతాల్లో కూల్చేసినప్పుడు ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చింది. దాన్ని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పెంచింది. ఎక్కడ ఏం జరిగినా హైడ్రా అనే ప్రచారం చేయడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది.