స్వరాష్ట్రాలకు వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తున్న వారి పట్ల తెలంగాణ సర్కార్.. సానుకూలంగా స్పందిస్తోంది. సొంత ఖర్చులో వారిని స్వరాష్ట్రాలకు పంపుతోంది. రోజుకు నలభై ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని దాదాపుగా ప్రతీ జిల్లాలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇటుక బట్టీల దగ్గర్నుంచి పవర్ ప్లాంట్ల వరకూ.. అన్నింటిలోనూ పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వీరికి ఉపాధి లేకుండా పోయింది. తెలంగాణసర్కార్.. వీరందరికీ రేషన్, రూ. ఐదు వందల సాయం చేసింది. అయినప్పటికీ..ఈ కరోనా కాలంలో పట్టణాల్లో ఉండటం కన్నా.. సొంత ఊళ్లకు వెళ్లిపోవడమే మంచిదన్న భావనలో వలస కూలీలు ఉన్నారు.
తమను స్వరాష్ట్రాలకు పంపాలని.. కొన్ని చోట్ల పోలీసులపై దాడులకూ ప్రయత్నిస్తూండటంతో.. పరిస్థితి విషమించకుండా.. వారికి సంబంధించిన రాష్ట్రాలతో తెలంగాణ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు.. పలు రాష్ట్రాలు.. తమ తమ వలస కూలీల్ని పంపాలని కోరుతున్నాయి. దీంతో తెలంగాణ సర్కార్.. .. వలస కూలీల వివరాల్ని తీసుకుని రైళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సులువుగానే పంపుతున్న తెలంగాణకు.. ఏపీకి వెళ్తామన్న వారి నుంచి మాత్రం చిక్కులు వస్తున్నాయి. ఏపీ సర్కార్ వారిని రానివ్వడం లేదు. పోలీసులు పెద్ద ఎత్తున ఇస్తున్న పాసులను ఏపీ సర్కార్ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒక్క డీజీపీ ఇచ్చిన పాసులను మాత్రమే అనుమతిస్తామనే వితండవాదన చేస్తున్నారు.
దీంతో వలసకూలీల్లో ఆగ్రహం పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎ రాష్ట్రానికి చెందిన వారు.. ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో… ఏపీ ఒక్కటే.. తమ పౌరుల్ని రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించడం విమర్శల పాలవుతోంది. తెలంగాణ సర్కార్ ఈ విషయంలో తమ పౌరుల్ని తీసుకు రావడానికి.. వేరే వారిని పంపడానికి సమన్వయంతో వ్యవహరిస్తోంది.