దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని సంబర పడుతూ ఉంటాం కానీ.. గిరిపుత్రుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. విద్య, వైద్యం కోసం వారు ఇప్పటికీ నిరంతర పోరాటం చేయాల్సిందే. ముఖ్యంగా వైద్యం కోసం నెలలు నిండిన వారిని డోలీల్లో మోసుకుపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా కొండలు, గుట్టలు దాటుకుని మైదాన ప్రాంతానికి రావాల్సిందే. రాజకీయాలు, నక్సలైట్లు ఇలాంటి అనేక సమస్యలతో వారికి మెరుగైన సౌకర్యాలు అందడం గగనంగా మారింది.
ఈ పరిస్థితిని మార్చాలనే ప్రయత్నంలో భాగంగా గిరిజన బిడ్డ అయిన తెలంగాణ మంత్రి సీతక్క… ఓ కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు. అదే కంటెయినర్ ఆస్పత్రి. మంత్రి సీతక్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ ను అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే ప్రప్రథమంగా కంటైనర్ హాస్పిటల్ ను ములుగులో అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఏటా వానా కాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. గర్భిణీ మహిళలకు సకాలంలో వైద్యం అందడం దుర్భరం. ఈ సమస్యలన్నింటికీ కంటెయినర్ ఆస్పత్రి పరిష్కారంగా మారింది.
నాలుగు పడకల ప్రత్యేక గది గల కంటైనర్ను సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఏ చిన్న పాటి జబ్బులు తలెత్తినా ఇందులో వైద్య చికిత్స అందిస్తారు. ఇందులో మందులతో పాటూ వైద్యపరీక్షలు జరిపే చిన్నపాటి ల్యాబులు కూడా ఏర్పాటు చేశారు. ప్రసవం సమయంలో గర్భిణీలు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయనవసరం లేకుండా ఈ కంటైనర్ హెల్త్ కేర్ యూనిట్ లోనే చికిత్స అందిస్తారు. ఇలాంటివి ఏపీ మన్యం ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తే గిరిజనలకు గొప్ప సేవ చేసినట్లే అనుకోవచ్చు.