తెలంగాణ సాధనలో మీది ప్రముఖ పాత్ర… వచ్చేయండి సన్మానం చేస్తామని ఇప్పటి వరకూ కేసీఆర్ చాలా మందిని పిలిచి ఉంటారు. ప్రభుత్వం తరపున చాలా మందిని సన్మానించి ఉంటారు. కానీ ఇలాంటి ఆహ్వానం కేసీఆర్ కే వస్తే ఎలా ఉంటుంది ?. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి ఆహ్వాన్ని కేసీఆర్కు పంపబోతోంది.
జూన్ రెండున భారీగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోంది. తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తున్న సోనియా గాంధీని అత్యంత భారీగా సన్మానించబోతున్నారు. ఇదే వేదికపై కేసీఆర్ ను కూడా సన్మానించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు.తెలంగాణను సోనియా ఇవ్వలేదని కేసీఆర్ గుంజుకొచ్చారని అంటారు. అసలు తెలంగాణ జాతిపితను ఇలా తక్కువ చేసేందుకే సన్మానం పేరుతో ఆహ్వానిస్తున్నారని బీఆర్ఎస్ అనుకునే పరిస్థితులు ఉన్నాయి. కేసీఆర్ కు అధికారిక ఆహ్వానం అందిన తర్వాత బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉంది. ఒక వేళ ఒప్పుకుంటే మాత్రం.. కేసీఆర్ ను రేవంత్ సన్మానిస్తారు. అదో ప్రత్యేక ఘట్టంగా మిగిలిపోతుంది.