రేవంత్ సర్కార్ చేస్తోన్న వాటికి ప్రచారం చేసుకోవడంలో వెనకబడటంతో ఏడాదిలో ఏం చేసిందనే అసంతృప్తిని జనాల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉంచగలుగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ చేపట్టిన కుల గణన, ఎస్సీ వర్గీకరణ తాజాగా భూభారతి వంటి విప్లవాత్మక అంశాలను ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కేసీఆర్ హయాంలో ఆయన మానసపుత్రిక ధరణి ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడంలోనూ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో భూవివాదాలు తెరపైకి వచ్చాయి.
భూభారతి చట్టం ప్రకారం మోసపూరితంగా పట్టాలు పొందిన వాటిని రద్దు చేయమని సీసీఎల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ధరణిలో ఇలాంటి నిబంధన లేదు. ధరణిలో గ్రామ రెవెన్యూ రికార్డుల గురించి లేని లోపాన్ని భూభారతి సరిదిద్దింది. ఎస్సీ ,ఎస్టీ మహిళాలకు న్యాయ సహాయం అందించాలని భూభారతిలోని సెక్షన్ 15(8),నిబంధన 16 గుర్తు చేస్తుంది. ధరణిలో ఇది లేదు. పాస్ పుస్తకాలు, భూదార్ పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు తర్వాత కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు. ధరణిలో ఇలాంటి వ్యవస్థ లేక కోర్టులపై ఆధారపడాల్సి వచ్చేది.
ఇలా..ధరణితో పోలిస్తే భూభారతి ఎన్నో భూ సమస్యలకు పరిష్కారం చూపేలా రూపకల్పన చేశారు. కేసీఆర్ పై ఆగ్రహానికి ధరణి పోర్టల్ కూడా ఓ కారణమే. ఇప్పుడు రేవంత్ భూ భారతి ద్వారా సమస్యలు లేకుండా, ధరణి బాధితులకు కొత్త పోర్టల్ తెచ్చారు. వీటిని జనాల్లోకి తీసుకెళ్లి మైలేజ్ తెచ్చుకుంటే కాంగ్రెస్ కు కొంత ఆదరణ లభిస్తోంది. కానీ, ఎస్సీ వర్గీకరణ , కుల గణన చేసినా ఎదో చేశామా అన్నట్లుగా భూ భారతిని కూడా లైట్ తీసుకుంటే కాంగ్రెస్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నా వృధానే.