ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి వెళ్లకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీబీఐకే ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో ఈ రోజు మళ్లీ సింగిల్ బెంచ్ మీద .. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తీర్పు అమలుపై మూడు వారాల స్టే ఇవ్వాలని కోరారు. ఫాం హౌస్ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రభుత్వం తెలిపింది. కేసు డైరీ కోసం సీబీఐ ఒత్తిడి చేస్తున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వారం రోజుల సమయం అవసరమని చెప్పారు. మరోవైపు ఫాం హౌస్ కేసును విచారణను సీబీఐకు బదిలీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తికి విన్నవించారు. మూడు సార్లు లేఖలు రాసినా స్పందించలేదని చెప్పడంతో.. ప్రభుత్వమే సీబీఐ విచారణ ప్రారంభం కాకుండా అడ్డుకుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లయింది.
అయితే ఈ అంశంపై నిర్ణయానికి న్యాయమూర్తి నిరాకరించారు. ప్రధాన న్యాయమూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. బుధవారం సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. అయితే బుధవారం హైకోర్టులో విచారణ జరగకుండానే.. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమే కాకుండా వెంటనే విచారణకు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడగానే.. కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది.
వెంటనే విచారణకు తీసుకోవాలంటూ సిజెఐ చంద్రచూడ్ ధర్మాసనాన్ని కోరిన సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సిబిఐ విచారణ ప్రారంభిస్తే సాక్ష్యాలన్నీ ధ్వంసమవుతాయని ఆందోళన వెలిబుచ్చారు. బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేను సీజేఐ కోరారు. ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్ తెలిపారు. బుధవారం మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని తెలిపారు. మొత్తంగా ఈ కేసు విషయంలో ప్రభుత్వం కిందా మీదా పడుతోందని అందరికీ క్లారిటీ వచ్చింది.