URSA క్లస్టర్స్ అనే కంపెనీకి విశాఖలో 56.36 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ రూ.5,728 కోట్ల రూపాయలో డేటా సెంటర్ పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టింది. తమది అమెరికా బేస్డ్ కంపెనీ అని చెప్పుకుంది. ఈ ప్రతిపాదనల్ని కేబినెట్లో పెట్టి ఆమోదించారు. అంటే ఆ కంపెనీకి భూమి కేటాయించడానికి ప్రాథమికంగా ప్రభుత్వం అంగీకరించింది. మరి ఆ కంపెనీకిఆ సామర్థ్యం ఉందా?. అమెరికాలో నిజంగా ఆ కంపెనీ ఉందా.. ఉంటే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది? లాంటివేమీ చూసుకోలేదు. తెలుగు360 చేసిన సర్వేలో URSA క్లస్టర్స్ అనే దానికి ఊరూ పేరూ లేదని తేలింది.
అమెరికాలో కనిపించని URSA క్లస్టర్స్ కంపెనీ
అమెరికా బేస్డ్ అని ప్రతిపాదనలు పెట్టడంతో ప్రభుత్వం నిజమేనని భూమి కేటాయింపులకు అంగీకరించింది. నిజానికి ఆ కంపెనీ ఉనికి అమెరికాలో లేదు. అంటే వారు అమెరికన్ బేస్డ్ అని చెప్పడం పచ్చి అబద్దం.
శేరిలింగంపల్లిలో ఓ అపార్టుమెంట్ ఫ్లాట్లో కంపెనీ
అసలు ఈ కంపెనీ ఎక్కడ ఉంది.. ఏం చేస్తుందని ఆరా తీస్తే అడ్రస్ శేరిలింగపల్లిలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాట్లో బయటపడింది. ఈ కంపెనీనీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రిజిస్టర్ చేశారు. పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి అనే వ్యక్తులు రిజిస్టర్ చేశారు. పోనీవీళ్లకేమైనా మంచి బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ ఉందా అంటే.. మొదటి సారి వీరిద్దరూ ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు. మరే కంపెనీలోనూ డైరక్టర్లుగా లేరు. అంటే వీరికి ఎలాంటి వ్యాపార అనుభవం లేదు.. డబ్బుల్లేవు.. అయినా సరే.. కంపెనీ పెట్టేసి భూముల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వంతోనూ ఎంవోయూ
దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతోనూ రూ. ఐదువేల కోట్ల పెట్టుబడికి ఎంవోయూ చేసుకున్నారు. హైదరాబాద్లోని ఏఐ పవర్డ్ డేటా సెంటర్ పెడతామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కథలు చెప్పారు. అయితే అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగాఏపీ ప్రభుత్వం వద్ద కూడా అవే ప్రతిపాదనలు పెట్టి భూములు కొట్టేసే ప్రయత్నం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇంత ఈజీగా ప్రభుత్వాలు మోసపోతాయా ?
ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడతామంటే ఆ కంపెనీకి ఓ రేంజ్ ఉండాలి. URSA క్లస్టర్స్ అనే కంపెనీ గురించి గతంలో ఎప్పుడూ విని ఉండరు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూనే కదా అని చేసుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వడానికి సిద్ధపడింది. ప్రభుత్వాలు ఇంత ఈజీగా మోసపోతాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహరం నడిచింది.
తక్షణం విచారణ జరిపించి – కేబినెట్ ఆమోదం రద్దు చేయాలి !
URSA క్లస్టర్స్ ప్రతిపాదనలు కేబినెట్ వరకూ వెళ్లాయంటే అంత ఈజీ కాదు. తెర వనుక ఎవరో ఉండి ఉంటారు. అటు తెలంగాణ అయినా.. ఇటు ఏపీ అయినా.. ఆ కంపెనీ డైరక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వెనుక ఎవరో ఉండి ఉంటారు. వారు బినామీలా.. మరొకటా అన్నది విచారణ చేయించి.. ఆ భూముల కేటాయింపునకు అనుకూలంగా తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.