ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును అమరావతిలో లేదా ఆంధ్రాలో వేరే ఏదయినా ప్రాంతంలో ఏర్పాటు చేసుకొనేవరకు కూడా ఉమ్మడి హైకోర్టుని విడదీయడానికి కానీ, విడదీసి హైదరాబాద్ లేదా వేరే ఎక్కడయినా ఏర్పాటు చేయడానికి గానీ విభజన చట్టం ప్రకారం వీలులేదని గతంలోనే ఉమ్మడి హైకోర్టు తేల్చిచెప్పింది. అయినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు విభజనకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీని గురించి కేంద్రంతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ కేంద్రం అందుకు అంగీకారం తెలిపి, ఏపి ప్రభుత్వం హైకోర్టు విభజనకు అంగీకరించినట్లయితే, ఏపి హైకోర్టు కోసం హైదరాబాద్ లోనే తగిన భవనాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఒకవేళ ఏపి ప్రభుత్వం అమరావతిలో తమ రాష్ట్ర హైకోర్టుని ఏర్పాటు చేసుకొనేమాటయితే, ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ఉన్న భవనాలలోనే తెలంగాణా హైకోర్టుని కొనసాగించాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు ప్రతిపాదనలు కూడా ఆచరణ సాధ్యం కానివని ఇదివరకే తెలిపోయినా తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ అవే ఆలోచనలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఒకవేళ ఆంధ్రా లేదా తెలంగాణా హైకోర్టుని హైదరాబాద్ లోనే వేరేగా ఏర్పాటు చేయదలిస్తే అందుకోసం ముందుగా విభజన చట్టంలో ఉమ్మడి హైకోర్టు గురించి ఉన్న నిబంధనలను సవరణ చేయవలసి ఉంటుందని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. అప్పుడే హైదరాబాద్ లో వేరేగా హైకోర్టు ఏర్పాటు సాధ్యం అవుతుందని తేల్చి చెప్పింది. ఆ సంగతి చెప్పి అప్పుడే ఏడాది కావస్తోంది కానీ హైకోర్టు విభజనకు తొందరపడుతున్న తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు సూచించిన విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయించలేదు. కనుక హైదరాబాద్ లో ఆంధ్రా లేదా తెలంగాణా హైకోర్టు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చును.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలోనే ఏపి హైకోర్టుని నిర్మించాలనుకొంటోంది. కానీ దాదాపు రెండేళ్ళు పూర్తవుతున్నా ఇంతవరకు రాజధాని నిర్మాణ పనులే మొదలుకాలేదు. కనుక అమరావతిలో హైకోర్టు భవనం ఇంకా ఎప్పటికి సిద్దం అవుతుందో ఎవరూ చెప్పలేరు. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, గుంటూరు లేదా రాష్ట్రంలో మరెక్కడయినా హైకోర్టు కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా చేయడం లేదు. కనుక ఆంధ్రాలో ఇపుడప్పుడే హైకోర్టు ఏర్పాటు అయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది.
ఆంధ్రాలో హైకోర్టు ఏర్పడే వరకు కూడా ఉమ్మడి హైకోర్టు విభజన కూడా సాధ్యం కాదు. చట్ట సవరణ చేయనందున హైదరాబాద్ లో వేరే చోట ఆంధ్రా లేదా తెలంగాణా హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. కనుక తెలంగాణా ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టు విభజన కోరుకొంటున్నట్లయితే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేయించుకోవాలి లేదా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడి ఏపిలో తాత్కాలిక భవనంలో రాష్ట్ర హైకోర్టుని ఏర్పాటు చేసుకోమని కోరడం మరో మార్గం. లేకుంటే అమరావతి నిర్మాణం జరిగి అందులో ఏపి హైకోర్టు సిద్దం అయ్యేవరకు ఎదురుచూడక తప్పదు.