కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలతో పాటు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన రెండు వేల ఎకరాల్లో వన్య ప్రాణులు ఉన్నాయి. నెమ్మళ్లు, జింకలు ఆవాసంగా మార్చుకున్నాయి. వీటిని సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. హైకోర్టు రిజిస్ట్రార్ కూడా సుప్రీంకోర్టుకు ఇలాంటి నివేదికే ఇచ్చారు. దీంతో కంచ గచ్చిబౌలి భూముల్ని అమ్మాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుని అక్కడ భారీ ఎకో పార్క్ ను నిర్మించాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
2 వేల ఎకరాల్లో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటి దాదాపుగా రెండు వేల ఎకరాల్లో ఉంటుంది. అందులో క్యాంపస్ చాలా కొద్ది ప్రదేశంలోనే ఉంటుంది. మహా అయితే ఓ పది ఎకరాల్లో క్యాంపస్ లు.. కార్యాలయాలు ఉంటాయి. మిగతా అంతా లంగ్ స్పేస్. చిట్టడవిలా ఉంటుంది. అక్కడ వన్య ప్రాణులు పెరుగుతున్నాయి. అప్పట్లో భూమి అందుబాటులో ఉండబట్టి అలా వేల ఎకరాలు కేటాయించారు కానీ ఇప్పుడు అయితే.. యాభై ఎకరాల్లో సెంట్రల్ వర్శిటీ పెట్టడం చాలా గొప్ప అవుతుంది. ఇంత భూమిని సెంట్రల్ వర్శిటీ ఉపయోగించుకోవడంలేదు.. లంగ్ స్పేస్ గానే ఉంది.
రెండున్నర వేల ఎకరాల్లో ఎకో పార్క్
కంచె గచ్చిబౌలి భూములతో పాటు సెంట్రల్ వర్శిటీని అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి తరలించి అక్కడ రెండున్నర వేల ఎకరాల్లో ఎకో పార్క్ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పెద్దల ముందు ఉంది. జరుగుతున్న పరిణామాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనల మేరకు సంప్రదింపుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు చేస్తే ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీలో సెంట్రల్ వర్శిటీకి వంద ఎకరాలు ?
సెంట్రల్ వర్శిటీని ఇక్కడి నుంచి తరలించడం వ్యయప్రయాసలతో కూడుకున్నదే. అయితే అసాధ్యమేమీ కాదు. ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాలను సెంట్రల్ వర్శిటీకి కేటాయించి.. భవనాల నిర్మాణం కోసం రూ. వెయ్యి కోట్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్క్
సెంట్రల్ వర్శిటీని తరలించి.. కంచె గచ్చిబౌలి భూముల్ని కూడా కలిపేసి అతి పెద్ద ఎకోపార్క్ నిర్మిస్తే పట్టణాల్లో ఉన్న వాటిల్లో అది ప్రపంచంలోనే అతి పెద్ద ఎకో పార్క్ అవుతుంది. టూరిజం డెస్టినేషన్ అవుతుందని ..ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని రకాల జంతు, జీవ జాతులకు ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రజల మద్దతు పొందేందుకు తెలంగాణ. ప్రభుత్వం ప్రయత్నాలు చేయనుంది.