ఏదైనా ప్రభుత్వంలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ .. పీఆర్వో వ్యవస్థ చాలా కీలకం. ఎంత కీలకమో.. అంతగా వివాదాస్పదం అవుతూ ఉంటాయి కూడా. మొదటి తెలంగాణ సర్కార్ విషయంలో.. ఇది మరీ వివాదాస్పదం అయింది. ఈ సారి అలాంటి పరిస్థితి రాకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. “కార్పొరేట్ కమ్యూనికేషన్” పేరిట ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. గత ప్రభుత్వంలో సీఎం సహా 16 మంది మంత్రులకు పీఆర్వోలను నియమించారు. అందరిపైనా.. ఒక్కో రకమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొంత మంది దొరికిపోయారు కూడా.
ప్రజా ప్రతినిధులకు చెందిన వాణిజ్య ప్రకటనల జారీలోనూ 15 నుంచి 20 శాతం కమీషన్లు నొక్కేశారు. ఆయా శాఖల నుంచి నేరుగా వాణిజ్య ప్రకటనలు గంపగుత్తగా జారీ చేయించి, పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా శాఖల్లో చిన్నాచితక సెటిల్మెంట్లు పీఆర్వోలే చేశారు. అంతేనా, కొన్ని సందర్భాల్లో మంత్రుల అపాయింట్మెంట్లకు కూడా వసూలు చేసినట్లు విమర్శలు వెలువడ్డాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి చిరాకు తెప్పించాయి. రెండో దఫా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. పీఆర్వోల వ్యవస్థను సంస్కరించాలని నిర్ణయించుకుంది. ఇక ఎవరినీ… మంత్రులు సొంతంగా నిర్ణయించుకోకుండా.. కార్పొరేట్ కంపెనీకి అప్పజెప్పబోతున్నారు.
అయితే ఈ విషయంలోనూ కొంత మందికి మినహాయింపులు లభించే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్కు అత్యంత ఆప్తులైన వారు మాత్రం.. ఆయన దగ్గర ప్రత్యేకంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పీఆర్వోగా చేరి.. కేసీఆర్ ప్రాపకం పొంది.. ఓ జర్నలిస్ట్.. ఏకంగా.. ట్రాన్స్కోలో ఉన్నత ఉద్యోగం పొందారు. అయినప్పటికీ.. ఒక్క రోజు కూడా విధుల్లోకి వెళ్లకుండానే.. డిప్యూటేషన్ పై .. సీఎం వద్దనే ఉంటున్నారు. ఇలాంటి వాళ్లకు మినహాయింపు ఉంటుంది. మంత్రులకు మాత్రమే.. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వ్యవస్థ పని చేస్తుంది.