జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహణపై హైకోర్టులో నేడు వాదోపవాదాలు జరుగుతున్నాయి. సుమారు ఏడాది పూర్తవుతున్నా ఇంకా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించడం, దానికి తెలంగాణా ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది ఎప్పటిలాగే వార్డుల పునర్విభజన, ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం వంటి కారణాలు చెప్పడం జరిగింది. గత ఏడాది డిశంబర్ 3వ తేదీతో జి.హెచ్.ఎం.సి.బోర్డు గడువు ముగిసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణా ప్రభుత్వం అదే పాట పాడుతూ కోర్టు నుంచి గడువు తీసుకొంటూనే ఉంది. మళ్ళీ ఇవ్వాళ్ళ కూడా అదే పాట పాడి జనవరి నెలాఖరు వరకు గడువు కోరింది. కాకపోతే ఈసారి ఆ గడువులోగా తప్పకుండా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తామని మాట ఇచ్చింది.
వార్డుల పునర్విభజన పేరిట కాంగ్రెస్, బీజేపీ, తెదేపాలకు బలం ఉన్న వార్డులను కుదించి, తెరాసకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో వార్డులను విభజించి వాటి సంఖ్య పెంచాలని తెలంగాణా ప్రభుత్వం భావించింది. కానీ వార్డుల పునర్విభజన సాధ్యం కాదనే సాకుతో దానిని నిలిపివేస్తూ తెలంగాణా ప్రభుత్వమే రెండు మూడు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ పేరిట తెరాసను వ్యతిరేకించే ఆంధ్రా ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనుకొంది. సుమారు 6.3 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించింది కూడా. కానీ అందుకు కేంద్ర ఎన్నికల కమీషన్ పంపిన బృందం చేత చివాట్లు తినవలసి వచ్చింది కనుక ఓటర్ల జాబితాలను సవరించే అవకాశం ఇక లేనట్లే. బహుశః అందుకే జనవరి నెలాఖరులోగా జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇస్తోందని భావించవచ్చును. ఇప్పటికే చాల సార్లు గడువు పొడిగించిన హైకోర్టు ఈసారి ఆ హామీని నోటిమాటగా కాకుండా అఫిడవిట్ రూపంలో అందజేయాలని కోరింది. అంటే జనవరిలో జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావించవచ్చును.