కేంద్ర ప్రభుత్వానికి ఇన్‌కంట్యాక్స్ ఉంటే.. తెలంగాణకు కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంట్ ఉందని.. గుర్తు చేసేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు దాడులు చేశారు. పదిహేను బృందాలు ఏకంగా 150 మంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతూంటే.. బీజేపీనేతలపై తెలంగాణ సర్కార్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్టుమెంట్‌ను ప్రయోగిస్తోందని దీని ద్వారా అర్థమవుతోందంటున్నారు.
ఇటీవల మునుగోడు ఉపఎన్నికల్లో సుశీ ఇన్ ఫ్రా వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ సంస్థకు కేంద్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కేటాయించిందని .. అందుకే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. అదే సమయంలో ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడు నియోజకవర్గంలో కొంత మంది నేతలకు రూ. కోట్లు ట్రాన్స్ఫర్ చేశారని టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆధారాల్లేవని ఈసీ ఆ ఫిర్యాదును తోసి పుచ్చింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత సుశీ ఇన్ఫ్రా టార్గెట్‌గా తెలంగాణ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది.
రాజకీయ కోణంలోనే ఈ దాడులు చేస్తున్నారని .. బీజేపీ నేతలంటున్నారు. కేంద్ర సంస్థలు.. దాడులు చేస్తున్నాయని.. దానికి పోటీగా తమ వద్ద కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయని చూపించేందుకు ఇలా బీజేపీ నేతలకు చెందిన వ్యాపార సంస్థలపై దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఈ సోదాల అంశంపై ఇంకా టీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు.