దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణాయే ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించుకొన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం విదేశీ సంస్థల ముందు అప్పు కోసం చేయి చాపడానికి సిద్దపడుతోంది. హైదరాబాద్ జంట నగరాలలో మురుగు కాలువలను పునర్నిర్మించేందుకు, ఇంటింటికీ మంచి నీళ్ళు అందించేందుకు, నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కొత్తగా రోడ్ల నిర్మాణానికి బ్రిక్స్ దేశాలు కలిసి స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు వద్ద నుండి రూ.30, 000 నుండి 35, 000 రుణం కోసం తెలంగాణా ప్రభుత్వం దరఖాస్తు చేసుకోబోతోంది. మునిసిపల్ మంత్రిత్వ శాఖ అధికారులు, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు కలిసి దాని కోసం అవసరమయిన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. రాగల 20సం.లలో జంట నగరాలలో పెరిగే జనాభాని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారు చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి ఆమోదించిన తరువాత అప్పు కోసం తెలంగాణా ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకొంటుంది.
హైదరాబాద్ జంట నగరాలను అభివృద్ధి చేయాలనే తెలంగాణా ప్రభుత్వ ఆలోచనను ఎవరూ తప్పుపట్టలేరు. కానీ తెలంగాణా రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెపుకొంటున్నప్పుడు మళ్ళీ ఈవిధంగా ఇంత భారీ అప్పులు చేయడం ఎందుకు? చేతిలో ఉన్న డబ్బుతోనే ఒకొక్క పనీ పూర్తి చేసుకొనే అవకాశం ఉన్నప్పుడు ఇంత భారీ రుణాలను తీసుకువచ్చి ప్రజల నెత్తిన ఆ అదనపు భారం మోపడం ఎందుకు? అయినా జంట నగరాలలో రోడ్లు, కాలువలు, మంచి నీళ్ళ పైపులు వేసేందుకే చేతిలో డబ్బులు లేకపోతే ఇక హైదరాబాద్ లో స్కైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు, రంగారెడ్డి-నల్గొండ జిల్లాల మధ్య ఎంటర్ టెయిన్ మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, సపోర్ట్ సిటీల నిర్మాణం ఎలాగ చేయాలనుకొన్నారో? అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా?