హైడ్రాకు చట్టబద్దత లేదంటూ కోర్టులకు వెళ్లిన వారికి షాకిచ్చే న్యూస్. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. గెజిట్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఇక హైడ్రా చట్టబద్దం. జీహెచ్ఎంసీ చట్టంలో ఈ ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారం ఇక గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ బాధ్యత ఓ అధికారి లేదా వ్యవస్థకు అప్పగిస్తారు. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు అప్పగిస్తారు.
హైడ్రాకు చట్టబద్ధత లేకపోవడంతో పాటు ఇటీవల హైడ్రా విషయంలో హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మండిపడ్డారు. అప్పట్నుంచి హైడ్రా కూల్చివేతలు ఆపేశారు. ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినందున ఇక హైడ్రా మళ్లీ బుల్డోజర్లను బయటకు తీసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశ్నించడానికి అవకాశం లేదు. ప్రభుత్వ ఆస్తి , చెరువును కబ్జా చేసిన వాటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తారు.
హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేదిలేదని రేవంత్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. మూసి కూల్చివేతల విషయంలో హైడ్రా యాక్టివ్ పార్ట్ తీసుకుంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ అక్కడి నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని.. అంతే కానీ వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని రేవంత్ చెబుతున్నారు. మూసీని .. చెరువుల్ని కాపాడుకోకపోతే.. హైదరాబాద్ అనేక సమస్యల్లో మునిగిపోతుందని తాము భవిష్యత్ కోసం పని చేస్తున్నామన్నారు.