కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ పెద్దగా పని చేయడం లేదంటూ వస్తున్న విమర్శల నేపధ్యంలో.. కొత్త పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళశై.. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ విషయాన్ని గవర్నర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లోనే ప్రకటించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. మరింత ప్రభావవంతంగా పని చేయాలని.. టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. తాను.. అధికారుల్ని పిలిపించి కరోనా కట్టడి చర్యలపై చర్చించినట్లుగా పెట్టిన ట్వీట్‌కు.. నెటిజన్లు ఇచ్చిన రియాక్షన్స్‌కు గవర్నర్ స్పందించారు. ఓ వ్యక్తి సేవ్ హైదరాబాద్ అనే ట్యాగ్‌లైన్ పోస్ట్ చేశారు. దానికి గవర్నర్.. నోటెడ్ అని రిప్లయ్ ఇచ్చారు. మరో వ్యక్తి కోవిడ్‌ను గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారని మరో వ్యక్తి స్పందిస్తే.. నిజమే అని రిప్లయ్ ఇచ్చారు. ఈ అంశంపై స్పందించిన నెటిజన్లందరికీ.. గవర్నర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో సమాధానం కనిపిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్.. . ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారని.. కొద్ది రోజుల నుంచి.. కనిపించడం లేదని.. విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రగతి భవన్లో పది మందికి కరోనా పాజిటివ్ రావడంతో.. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదు. ప్రెస్‌మీట్ పెట్టక చాలా కాలం అవుతోంది. అదే సమయంలో.. టెస్టుల విషయంలో.. ప్రభుత్వం నుంచి హైకోర్టుకు పదే పదే చీవాట్లు ఎదురవుతున్నాయి. అయినా పరిస్థితులు మెరుగుపడుతున్న సూచనలు కనిపించడం లేదు.
దీంతో.. ప్రజల్లోనూ ఓ రకమైన అసంతృప్తి ప్రారంభమైనంది. కరోనా బారిన పడిన వారికి.. అటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ.. ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ చికిత్స అందడం గగనం అయిపోయింది. గచ్చిబౌలి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకు రావడంలో ఆలస్యం జరిగింది. ఎక్కడా బెడ్స్ ఖాళీ లేవు. దీంతో కరోనా పేషంట్లు ఎక్కువగా… హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉన్న వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ రంగంలోకి దిగి.. పరిస్థితిని మెరుగ్గా మారిస్తే… బాగుండని ప్రజలు కూడా కోరుకుంటున్నారు.