మూడు రోజుల కిందట కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రోజు బిల్లు డ్రాఫ్ట్ ఆమోదానికి గవర్నర్‌కు పంపారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చారు. రాజ్ భవన్ నుంచి బిల్లు రావడం ఆలస్యం.. ఆమోదించేందుకు రెడీగా ఉన్నారు. బిల్లు వచ్చేస్తుందన్న గట్టి నమ్మకంతో అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులే పెట్టుకున్నారు. కానీ గవర్నర్ మాత్రం.. ఆ బిల్లును మళ్లీ పంపలేదు. తనకు సమయం పడుతుందని తీరికగా చెప్పారు. దీంతో బీఆర్ఎస్కు షాక్ తగిలినట్లయింది. ఇదంతా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లు విషయంలోనే జరిగింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కానీ.. ఇది ఆర్థిక బిల్లు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే ముందు గవర్నర్ ఆమోదం కావాలి. అందుకే బిల్లు డ్రాఫ్ట్ ను రాజ్ భవన్ కు పంపించారు. రెండు రోజులు అయినా సమాచారం రాలేదు. దాంతో బిల్లును గవర్నర్ తొక్కి పెట్టారని బీఆర్ఎస్ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియాలో బ్రేకింగ్‌లు రావడంతో రాజ్ భవన్ స్పందించింది. మొన్ననే బిల్లు రాజ్ భవన్ కు వచ్చిందని పరిశీలనకు కొంత సమయం పడుతందని తమిళిసై స్పష్టం చేశారు. న్యాయసలహా తీసుకోవాల్సి ఉందన్నారు.
ఆర్టీసీ విలీనం అనే చిక్కుముళ్లతో నిండి ఉంటుంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. అందుకే కొర్రీలు పెట్టడానికి గవర్నర్‌కు అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దగా చేయడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆర్టీసీ కార్మికులను రాజ్ భవన్ వైపు పంపిస్తోంది. శనివారం.. చలో రాజ్ భవన్ నిర్వహిస్తున్నామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. గవర్నర్ బిల్లును వెంటనే ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.