గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ షాకిచ్చారు. ఆ ఎమ్మెల్సీల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి సిఫారసులు చేసినా అంగీకరించేది లేదని రాజ్ భవన్ తెలిపింది. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసు ఉందని ఆ కేసు పరిష్కారం అయిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాజ్ భవన్ ప్రకటనతో రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ చేయాలని అనుకుంటున్న కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలినట్లయింది.
దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జూలైలో బీఆర్ఎస్ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. అయితే వారి ప్లేస్ లో వేరే వారిని కేసీఆర్ రిఫర్ చేయలేదు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ కూడా వెంటనే ఎమ్మెల్సీల్నీ భర్తీ చేయలేదు.దీంతో ఈ జనవరిలోనే హైకోర్టులో శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్ వేశారు. ఒకసారి పిటిషన్ విచారణకు వచ్చింది. మళ్లీ ఈ నెల 24వ తేదీన విచారణకు రానుంది.
రెండు గవర్నర్ స్థానాలు ఖాళీగా ఉన్నందున కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేయాలని అనుకున్నారు. కానీ కోర్టులో కేసు తేలే వరకూ ఏ సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్ ముందుగానే చెప్పడంతో … ఆ రెండు స్థానాల భర్తీ ఇప్పుడల్లా ఉండదని తేలిపోయింది. కోర్టులో కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు కానీ.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎడాదికిపైగా ఖాళీగా ఉన్నాయి.