తన ఫోన్‌నూ ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిశై సంచలన ఆరోపణలు చేశారు. ఫామ్ హౌస్ డీల్స్ కే్సులో తననూ ఇరికించేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపిస్తున్నారు. పదే పదే తుషార్ అనే వ్యక్తి పేరును ప్రస్తావిచండమే కాకుండా.. రాజ్ భవన్ పేరును కూడా కే్సులో చొప్పించారని.. ఆమె మండిపడ్డారు. తుషార్ వెల్లపల్లి అనే వ్యక్తి గతంలో తమిళిసై వద్ద ఏడీసీగా పని చేశారు. రాజ్ భవన్లో ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన గవర్నర్.. ఈ అంశంపై చేసిన ఆరోపణలు సంచలనం అవడం ఖాయంగా కనిపిస్తున్నాయి.
గత వారం ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గవర్నర్ కలిశారు. ఇప్పుడు తన ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన ఉందన్నారు. ఫామ్ హౌస్ డీల్స్ కేసుల్లో తుషార్ వెల్లపల్లి ప్రస్తావన కూడా ఉంది. ఫోన్‌కాల్ రికార్డింగుల్లోనూ ఆయన పేరు పదే పదే వినిపించింది. కేరళకు చెందిన తుషార్ భారత ధర్మ జనసేన (బీడీజేఎస్) నాయకుడిగా కొనసాగుతున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి గత ఎన్నికల్లో రాహుల్‌గాంధీ మీద ఎన్డీయే తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తుషార్ గవర్నర్‌గా తమిళిసై వచ్చిన తర్వాత తెలంగాణ రాజ్‌భవన్‌లో ఏడీసీగా పని చేశారు.
రాజ్ భవన్ ప్రతిష్టను తగ్గించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని.. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రోటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ సర్కార్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కూడా ఇలాంటి ఆరోపణలు చేయడంతో.. ఇప్పుడు కేంద్రం సీరియస్‌గా స్పందిస్తుందేమో వేచి చూడాలి.