ప్రధానమంత్రితో భేటీ కోసం అంటూ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారో లేదో కానీ.. ఈ లోపు గవర్నర్ తమిళిశై ఢిల్లీకి రావడం ప్రధానమంత్రితో భేటీ కావడం జరిగిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రధానితో భేటీ తర్వాత తమిళిశై కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ గవర్నర్లు ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించవచ్చని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అందుకే ఆమె ఘాటుగా మాట్లాడారని భావిస్తున్నారు.
మహిళా గవర్నర్ను కేసీఆర్ అవమానిస్తున్నారని.. కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. వ్యక్తిగతందా తనను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదన్న తమిళిసై.. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేయాల్సి ఉందన్నారు. వరంగల్లో పేషంట్లను ఎలుకలు కొరికిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్ కోటాలో ఎవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్నది తన విచక్షణాధికారమని గవర్నర్ స్పష్టం చేశారు.
తాను రాజకీయాలు చేస్తున్నాని కేసీఆర్ ఆరోపించడంపై కూడా తమిళిసై స్పందించారు. విషయంలో రాజకీయాలు చేశానో బయట పెట్టాలిన్నారు. ట్రైబల్ గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి అంశాల గురించి మాట్లాడానని అందులో తప్పేమీ లేదన్నారు. తానేమీ వివాదాస్పదం చేయలేదు. నేను చర్చకు సిద్ధంగా ఉన్నాననని స్పష్టం చేశారు. ఈ కారణాలు సాకు చూపి గవర్నర్ కార్యాలయాన్ని అవమానించడం సరికాదన్నారు.అధికారులను సైతం హాజరు కాకుండా, ప్రోటోకాల్ అమలు చేయకుండా చేయడం సరైన చర్యేనా? అని ప్రశ్నించారు.
గవర్నర్ను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సిద్దంగా లేరు… అదే సమయంలో గవర్నర్ను గౌరవించి తీరాల్సిందేనని తమిళిశై నేరుగా ప్రధాని మోదీతో భేటీ తర్వాతే అన్నారు. అంటే ఇక ముందు నుంచి బెంగాల్ తరహాలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అనే ఫైట్ కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.