తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీలో మరోసారి కేసీఆర్పై బరస్ట్ అయ్యారు. కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ కుట్ర వ్యాఖ్యలపై తాను బరస్ట్ కానంటూనే పలు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆమె ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార సందర్భంగా ఏ విభేదాలు లేనట్లుగా ఉన్నారని.. సమస్యలు పరిష్కారమయ్యాయా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. తనకు ఎలాంటిప్రోటోకాల్ అందడం లేదని.. ఆ సమావేశం తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు.
అంతే కాదు కేసీఆర్పై ఆమె సూటిగా విమర్శలు చేశారు. కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో చోటు లేదన్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనను ఎంత నియంత్రించినా.. ప్రోటోకాల్ ఇవ్వకపోయినా ఆగబోనని.. తాను ప్రజల్లో ఉంటానన్నారు. ఢిల్లీలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. గవర్నర్ను గుర్తించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు కానీ హైకోర్టు సీజే ప్రమాణస్వీకారం కోసం మాత్రం తప్పని సరిగా రాజ్ భవన్కు హజరు కావాల్సి ఉంది. అక్కడ్ గవర్నర్తో కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు.
రాజకీయాలు మాట్లాడనంటూనే ఆమె కేసీఆర్ రాజకీయ ప్రణాళికలపై మాట్లాడట.. తనపై అదే కక్ష సాధింపు జరుగుతోందన్నట్లుగా చెప్పడంతో కోల్డ్ వార్ ముగియలేదని రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. కొసమెరుపేమిటంటే… అసలు కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరబోతున్నారన్నవిషయం కన్ఫర్మ్ అయిన తర్వాతే తమిళిసై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను టార్గెట్ చేసిన బీజేపీకి .. ఇప్పుడు గవర్నర్ ఓ ప్రధాన ఆయుధం అన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.