తెలంగాణ గవర్నర్ తమిళిసై కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనకుుంటున్నారు కానీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. అసలు గవర్నరే లేరని కేసీఆర్ అనుకుటూ ప్రభుత్వాన్ని నడిపించుకుంటున్నారు. రాజ్ భవన్ ఉనికిని ఆయన గుర్తించడం లేదు. న్యాయవ్యవస్థను గౌరవించాలి కాబట్టి ఆయన ఓ సారి సీజే ప్రమాణస్వీకారానికి వెళ్లారు. తర్వాత పరిస్థితి మామూలే. ఈ అంశంపై గవర్నర్ తరచూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా తాను గవర్నర్ పదవిలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ఎప్పుడూ చేసే విమర్శలనే్ ప్రభుత్వంపై చేశారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ఇవ్వడం లేదని.. హెలికాఫ్టర్ అడిగినా సమాచారం లేదన్నారు. అలాగే ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని చెప్పి రాలేదని.. కనీసం రావట్లేదన్న సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారన్నారు.
గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని ప్రశ్నించారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. మేడారం, భద్రాచలం పర్యటనలకు వెళ్లినప్పుడు హెలీకాప్టర్ అడిగితే కనీసం ఎవరూ స్పందించలేదని గుర్తు చేశారు. చేసేది లేక తాను రోడ్డు మార్గం ద్వారా 8 గంటలు ప్రయాణించి వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన చెందారు.
తమిళిసై ఆవేదన ఎక్కువగా ప్రోటోకాల్ గురించే ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదో కానీ.. ప్రోటోకాల్ మాత్రం ఇవ్వడం లేదు ఆమెకు అధికారికంగా ఇవ్వాల్సిన .. కల్పిచాల్సిన సౌకర్యాలు కల్పిస్తే తమిళిసై ప్రభుత్వంతో వివాదాల్లేకుండా ఉండే అవకాశం ఉంది. ప్రత్యేకమైన రాజకీయ ఎజెండాను అమలు చేయడం లేదని.. బెంగాల్ , తమిళనాడు గవర్నర్లు వ్యవహరించినట్లుగా వ్యవహరించడం లేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు.