తెలంగాణ గవర్నర్ తాను రాజకీయం ఏమీ చేయడం లేదని అంటున్నారు. కానీ ఆమె తన ప్రజాసంబంధాల అధికారికారిక తమిళనాడు బీజేపీ పార్టీ పీఆర్వోను నియమించుకున్నారు. ఈ విషయం ఇప్పుడు దుమారం రేపుతోంది. తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ తన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా తమిళనాడు బీజేపీ శాఖకు పీఆర్వో వ్యవహరిస్తున్న వ్యక్తిని నియమించుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దీనిపై టీఆర్ఎస్ నేతలతో పాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే తాను ఎక్కడ రాజకీయం చేశానో చెప్పాలని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని.. కనీసం గౌరవించడం లేదని తమిళిసై అంటున్నారు. అదే సమయంలో వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న సంఘటనలపై ప్రతీ రోజూ స్పందిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల అంశంలో జరిగిన స్కాంపై కాళోజీ మెడికల్ వర్శిటీ వీసీని నివేదిక అడిగారు. శుక్రవారం జరిగిన ఓ ప్రేమోన్మాది దాడి ఘటనపైనా ఆరా తీశారు. రోజువారీగా ఆమె యాక్టివ్ అవుతూండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.
ఈ విషయం మరింత వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. అయితే పీఆర్వోను ఎవరిని పెట్టుకోవాలన్నది గవర్నర్ ఇష్టమని ఆయన బీజేపీ పార్టీకి పని చేస్తారా లేకపోతే.. మరో పార్టీకి పని చేస్తారా అవసరం లేని విషయమన్నారు. నిర్ణయాలు ఏవైనా గవర్నర్ తీసుకుంటారని.. వాటిని ప్రజలకు తెలియచేసేలా చేయడమే పీఆర్వో విధులని కొంత మంది గుర్తు చేస్తున్నారు.