రైతు రుణమాఫీపై నిర్దేశించుకున్న డెడ్ లైన్ సమీపిస్తుండటంతో రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. హామీ ఇచ్చినట్టుగానే పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరాలనుకుంటున్నా , నిధుల సర్దుబాటు సంక్లిష్టంగా మారడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఉద్యోగులు, ఐటీ పేయర్స్ , ప్రజా ప్రతినిధులకు రుణమాఫీని వర్తింపజేయవద్దని సర్కార్ సమాలోచనలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఎవరెంత రుణాలు తీసుకున్నారు..? అందులో ఉద్యోగులు, ఐటీ పేయర్స్ ఎంతమంది ఉన్నారు..? అని అంశంపై అధికారులు ఇప్పటికే నివేదిక రెడీ చేశారు. రెండు మూడు రోజుల్లో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విషయాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు మంత్రివర్గం ముందుంచనున్నారు.
అయితే, పీఎం కిసాన్ సమ్మాన్ ప్రకారమే రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అని సర్కార్ ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా తెలంగాణలో ప్రతి సంవత్సరం 32.68లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. వీరికే రుణమాఫీని వర్తింపజేస్తే సర్కార్ కు 15వేల కోట్లు ఆదా అవుతుందని అధికారులు అంచనాకు వచ్చారు.
ఎలాంటి కండిషన్లు లేకుండా రుణమాఫీ చేస్తే 33వేల కోట్ల నుంచి 38వేల కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిధుల సర్దుబాటు కష్టంగా మారడంతో రుణమాఫీ అమలు విషయంలో ఎలాంటి పరిమితులు విధించాలన్న దానిపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. మరో వైపు, ఫ్యామిలీని మొత్తంగా ఓ యూనిట్ గా తీసుకొని రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనలు కూడా చేస్తోంది.
ఇలా వీటన్నింటిపై రెండు మూడు రోజుల్లో జరగనున్న కేబినెట్ లో చర్చించి రుణమాఫీ అమలు తీరుతెన్నులపై సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయనుంది.