దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై.. తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదులు కొనసాగిస్తోంది. అమరావతి నీటి అవసరాల కోసం.. గుంటూరు జిల్లా వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై నూతన ఆనకట్ట నిర్మాణానికి కొద్ది రోజుల కిందట చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో పది టీఎంసీల నీటిని నిల్వ చేసి రాజధాని తాగునీటి అవసరాలతో పాటు మెట్ట భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాజధాని వెంట 97 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మునేరు, పాలేరు, కట్లేరు వంటి నదుల నుంచి కృష్ణా నదిలో కలిసే నీటిని వైకుంఠపురం ప్రాజెక్టులో నిల్వ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వైకుంఠపురం వద్ద బ్యారేజీకి నిర్మాణానికి రూ.2169 కోట్ల కు పరిపాలక అనుమతులు ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. రాజధాని అవసరాలు తీర్చేందుకు ఇదే ప్రధాన వనరుకానుంది.
రాజధాని ప్లాన్ ఇచ్చే సమయంలోనే సింగపూర్ ప్రతినిధులు ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ నీటి అవసరాలు తీర్చలేదని, మరో బ్యారేజీ కావాలని సూచించారు. దీనిపై చర్చించిన అనంతరం వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా బ్యారేజీ నిర్మించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. కేఆర్ఎంబీకి.. ఈ విషయంపై పూర్తి వివరాలతో లేఖ రాసింది. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరింది. నిజానికి దిగువ రాష్ట్రం కట్టే ప్రాజెక్టులపై..ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకంటే.. పై నుంచి కిందకు వచ్చే నీరు.. ఆ రాష్ట్రం వాడుకోకపోతే.. నేరుగా సముద్రంలోకి పోతాయి తప్ప.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఎన్ని నీళ్లు నిల్వ చేసుకుంటారన్నది… చిట్ట చివరి రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటి.. తెలంగాణ ప్రభుత్వం… దిగువ రాష్ట్ర ప్రాజెక్టులపై… ఫిర్యాదులు చేస్తూనే ఉంది. సముద్రంలోకి పోతున్న నీటిని పట్టిసీమ ద్వారా..మళ్లిస్తే.. దానిపైనా ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు వైకుంఠపురం బ్యారేజీపైనా ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్రం అధీనంలోని కేఆర్ఎంబీ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి..!