తిరుమలలో లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కల్తీ నెయ్యి వాడటం, జంతువుల కొవ్వు అవశేషాలున్నాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో, కర్నాటక ప్రభుత్వరంగ డెయిరీ నందిని నెయ్యికి గిరాకి పెరిగింది.
కర్నాటకలో ప్రైవేటు డెయిరీల నుండి నెయ్యి కొనుగోలుపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించింది. నందిని డెయిరీ నుండే దేవాలయన్నీ నెయ్యిని కొనుగోలు చేయాలంటూ ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా, తెలంగాణ కూడా అదే రకమైన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వరంగ డెయిరీ విజయ డెయిరీలో తయారైన నెయ్యినే వాడేలా చర్యలు తీసుకున్నట్లు సంస్థ చైర్మన్ ప్రకటించారు. తెలంగాణలోని అన్ని దేవాలయాలతో పాటు ప్రభుత్వ పరిధిలో నడుస్తున్న సంక్షేమ హస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, జైళ్లు, ఆసుపత్రులకు విజయ డైయిరీ పాలు, పాల పదార్థాలనే వాడాలని నిర్ణయం తీసుకున్నారు.
దీని వల్ల రైతులకు మరింత మేలు జరగటంతో పాటు కల్తీని అరికట్ట వచ్చని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు.
మరోవైపు తిరుమలలో కల్తీ నెయ్యి ఘటన తర్వాత తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో వాడుతున్న నెయ్యిని ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కల్తీకి అవకాశం లేకుండా చూడాలని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని స్పష్టం చేసింది. ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.