ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై యువత చాలా అసంతృప్తిగా ఉంది. తీరైన నోటిఫికేషన్ ఒక్కటంటే.. ఒక్కటి కూడా ఇంత వరకూ అమల్లోకి రాలేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. కొత్తగా రెండు నెలలలోగా 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామాకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి నియామకాలను కొత్త జిల్లాల ప్రాతిపదికనే చేపట్టాలని కేసీఆర్ పట్టుబడుతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపడితే ఇప్పుడున్న జోనల్ విధానం కారణంగా కోర్టు కొట్టి వేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయ నియామకాల కోసం 31 జిల్లాల ప్రాతిపదికన ఇచ్చిన నోటిఫికేషన్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ ఇబ్బందిని అధిగమించాలంటే.. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేయాలి. కానీ ఇది కేంద్రం వద్ద పెడింగ్‌లో ఉంది. పాత వ్యవస్థను సవరించి కొత్తగా ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేబినెట్లో కొత్త జోనల్ విధానాన్ని ఆమోదించారు. కేంద్రం వద్దకు పంపారు. ప్రతిపాదనలు పంపిన మొదట్లో కొన్ని అంశాలపై వివరణలు కోరారు. స్టేట్ క్యాడర్ పోస్టులను పూర్తిగా ఎత్తివేయడం… అన్నింట్లో 95శాతం స్థానికులకే అవకాశాలు కల్పించడంపై కేంద్రం వివరణ కోరింది.ఈ రెండు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరణ కూడా పంపింది. కానీ కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
ముందస్తు సన్నాహాల్లో కేసీఆర్.. ఈ చిరు ఉద్యోగాలయినా.. యువతకు ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే పంచాయతీ కార్యదర్శుల నియామకాలకు అడ్డులేకుండా కేంద్రం నుండి కొత్త జోనల్ విధానానికి అనుమతి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మకు ఢిల్లీకి పంపారు. ఆయన ఢిల్లీలోనే ఉండి కేంద్ర హోం, న్యాయ శాఖ అధికారులతో చర్చించనున్నారు. కేంద్రం.. ఈ జోన్లకు ఆమోదముద్ర వేసి.. రాష్ట్రపతి వద్దకు పంపితనే … పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ అవుతాయి. లేకపోతే.. పాత జిల్లాల ప్రకారం నియమకాలు జరపాల్సి ఉంటుంది. కానీ ఇవి మరిన్ని కొత్త సమస్యలు సృష్టిస్తాయి.
s notification