బతుకమ్మ చీరల పంపిణీపై ఈసారి తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీలో భారీగా గోల్ మాల్ జరిగిందని ఆరోపణలు ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరో స్కీమ్ తీసుకురావాలని భావిస్తోందని తెలుస్తోంది.
బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేస్తే మహిళా లోకం నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా? అని ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.గత ప్రభుత్వం అందించిన ఈ బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చీరల పంపిణీకి బదులుగా మరో స్కీమ్ పై అధికారులు కసరత్తు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. దీంతో మహిళలకు ఏమైనా బహుమతులు ఇస్తారా? ఆర్థిక సాయం చేస్తారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
పండగల సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఏమైనా బహుమతులు ఇస్తున్నాయా? నగదు పంపిణీ చేస్తున్నాయా? అనే విషయాలను పరిశీలించి, బతుకమ్మ చీరల పంపిణీపై సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు నగదు ఇస్తే ఎలా ఉంటుంది?ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలి? ఆర్థిక సాయం చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది వంటి వివరాలను పరిశీలించి ఈ విషయంలో సర్కార్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.