రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మించిన మాయల మరాఠీ ఎవరైనా ఉన్నారా? తెలంగాణాలో ఉన్న విపక్షాలన్నీ కలిసినా కూడా కెసీఆర్ మాటల దాడిని మాత్రం ఎదుర్కోలేకపోతున్నాయి. కెసీఆర్ కుటుంబానికి అనుకూలంగా ఉంటే చంద్రబాబు కూడా వీర తెలంగాణావాది అయిపోతాడు. అదే కెసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం కోదండరామ్ కూడా సీమాంధ్ర నేతలతో కుమ్మక్కై తెలంగాణా రాష్ట్రానికి నష్టం చేస్తున్నవాడైపోతాడు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని ఫణంగా పెట్టి మరీ తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీని కూడా ఓ సారి దేవత అని, మరోసారి దెయ్యం అని అనగల ఘనపాఠి కెసీఆర్. ఇక నోట్ల రద్దు విషయంలో కెసీఆర్ వేసిన మాటల కుప్పిగంతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇక తాజాగా కెసీఆర్కి ఉన్న దళిత ప్రేమ అసలు రంగు కూడా బయటపడింది. తెలంగాణా పోరాట సమయంలో దళితులకే ముఖ్యమంత్రి పదవి, తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ఊరూవాడా చాటిన కెసీఆర్ అధికారంలోకి వస్తున్నాం అని తెలిసిన మరుక్షణంలోనే రాజకీయ చాణక్యం ప్రదర్శించాడు. కెసీఆర్ని మించిన యోధుడు, వీరుడు తెలంగాణాలో ఉన్న దళితుల్లో లేనేలేడు అనే రేంజ్లో సీమాంధ్ర నేతల కుట్రలను తట్టుకుని తెలంగాణాను అభివృద్ధి పరచాలంటే కెసీఆరే ముఖ్యమంత్రి కావాలని చెప్పి తన పార్టీలో ఉన్న బానిస నేతల చేత, అనుకూల మీడియా చేత ప్రచారం చేయించుకున్నాడు. తెలంగాణా సమాజం మొత్తం కూడా కెసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటోందన్న కలర్ ఇచ్చాడు. కుర్చీ ఎక్కేశాడు. ఇక టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉండాలే కానీ కెసీఆర్ తర్వాత కెటీఆర్, కెటీఆర్ తర్వాత ఆయన కొడుకులు ముఖ్యమంత్రులు అయ్యేలా ప్లాన్ చేసుకుంటారనడంలో సందేహం లేదు. కల్వకుంట్ల పల్లకీని మోయడానికి మాత్రం దళితులు కావాలి.
ముఖ్యమంత్రి పదవి విషయం పక్కన పెట్టినా రాష్ట్రంలోనే అత్యున్నత అధికారి అయిన ఒక దళిత ఛీఫ్ సెక్రటరీని కూడా అత్యంత అవమానకర పరిస్థితుల మధ్య ఇంటికి పంపించాడు కెసీఆర్. డిసెంబర్లో బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్రకు కొనసాగింపు అవకాశం దక్కకపోగా కనీసం ఆనవాయితీ ప్రకారం గౌరవప్రదమైన వీడ్కోలు దక్కకుండా చేసింది తెలంగాణా సర్కార్. రాజీవ్ శర్మలాంటి తనకు నచ్చిన అధికారుల గురించి బహు గొప్పగా మాట్లాడిన కెసీఆర్ దళిత ఉద్యోగి అయిన ప్రదీప్ చంద్ర విషయంలో మాత్రం పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ప్రదీప్ చంద్రకు వీడ్కోలు సభ నిర్వహించకపోవడంతో అవమానంగా ఫీలయిన ఆ సీనియర్ అధికారి తన తర్వాత చీఫ్ సెక్రటరీగా నియమితులైన ఎస్పీ సింగ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాలేదు. రాజకీయ నాయకుల విషయంలో నచ్చినవాళ్ళతో ఒకలా, నచ్చనివాళ్ళతో మరోలా ప్రవర్తించడం కెసీఆర్కి అలవాటే. కానీ అదే అలవాటును అధికారుల విషయంలో చూపించడం మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి భావ్యం కాదని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీఆర్ఎస్తో పాటు అన్ని పార్టీలలోనూ ఉన్న దళిత నేతలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.