ఈనాడు అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు ఫిలింసిటీకి దీటుగా ఓం సిటీ కట్టి ఆధ్మాత్మిక ముద్ర వేసుకుంటానని ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలోనే ఒకటికి రెండు సార్లుప్రకటించారు. . రామోజీ రామేశ్వరరావు ఎవరైనా సరే వ్యక్తిగత సాన్నిహిత్యాలు భక్తి విశ్వాసాలు వారి ఇష్టమే. కాని వీటికి ఫ్రభుత్వాధినేతల ప్రమేయం, సహాయం అవసరమైనప్పుడే సమస్య మొదలవుతుంది. ఫిలిం సిటీ భూములపైనే చిన్నచిన్న వివాదాలు వున్నా సులభంగా పరిష్కరిస్తామని కెసిఆర్ సిటీలోనే ప్రకటించి వచ్చారు. ే ఇప్పుడు ఓం సిటీకోసం మరో మూడు వేల ఎకరాలు కావాలని రామోజీ చేసిన అభ్యర్థన చక్కర్లు కొడుతున్నది. ఇందుకు అటవీ భూమిని కేటాయించేందుకు కెసిఆర్ సర్కారు సిద్ధమై పోయింది కూడా. నిబంధనల మేరకు దానికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని చూపించడానికి కూడా టి సర్కారు రెడీనే. అయితే కేంద్రమే ఒకింత తటపటాయిస్తున్నట్టు సమాచారం. కనీసం అలాటి తీవ్ర పరిశీలన చేసినట్టు కనిపించే ప్రయత్నం చేస్తున్నది. అటవీభూమిని ప్రజావసరాల నిమిత్తం తప్ప ఇతర పనుల కోసం కేటాయించడం తరలించడం చట్టం ఒప్పుకోదు. ఓం సిటలో ఎంత ీ భక్తి వున్నా ప్రైవేటు టూరిజం ప్రాజెక్టు. పూర్తిగా రామోజీ గ్రూపు యాజమాన్యంలో నడుస్తుంది. అలాటప్పుడు దానికి మూడు వేల ఎకరాల అటవీభూమిని ఇస్తే విమర్శలు తప్పవు. రామ్‌దేవ్ బాబా , రవిశంకర్ గురూజీల ఉదంతం చూశాక వ్యాపారం రాజకీయం మతం ఎలా పెనవేసుకుపోయాయో వ్యాపార పత్రికలే చెబుతున్నాయి. .ఇక ఇప్పుడు ఓం సిటీ దాని మరో రూపం కాబోతుందని అవి వూహిస్తున్నాయి. అయితే 360లో గతంలో చెప్పుకున్నట్టు తెలుగునాట నలుగురు ఘనాపాటీలైన ఇద్దరు చంద్రులు ఒక వెంకయ్య నాయుడు, ఒక రామోజీ రావు తలపెట్టిన ఈ ఓం వ్యవహారం ఒకె అవుతుందని టిడిపి ప్రముఖుల సమాచారం. ఫిలిం సిటీలో భూమిని దున్నిస్తానని కెసిఆర్ ఉద్యమ కాలంలో అన్నారా లేదా అనేది పెద్ద వివాదంగా వుంది. పదాలు ఏమైనా సరే ఇలాటి వ్యాఖ్యలు ఆయన చేసినప్పుడు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. అది కెసిఆర్ భూముల కోసం పోరాటం చేపట్టిన కాలం. టీవీ9లో రజనీ కాంత్ నేను చర్చిస్తుండగా కెసిఆర్ ఫోన్లైన్లో వచ్చారు. అప్పట్లో ఆయన ఉద్యమం వేడిని కాపాడేందుకు అలా జోక్యం చేసుకోవడమే గాక చాలాసేపు ఓపిగ్గా మాట్లాడేవారు. బాగో జాగో అన్న నినాదం వంటివి మంచిది కాదని నేనన్నాను. అయితే మీరు వామపక్ష యోధులుగా భూ స్వాధీన ఉద్యమాన్ని బలపర్చాలని కెసిఆర్ అన్నారు. గతంలో వైఎస్ హయాంలో కమ్యూనిస్టుల భూపోరాటం జరిగినప్పుడు మీరు బలపర్చలేదు కదా అని నేను ప్రశ్నించాను. ముదిగొండ కాల్పుల తర్వాత మృతుల పరామర్శకు వెళ్లిన మొదటి నాయకుణ్ని నేనే ననిసీనియర్ జర్నలిస్టు మీకు తెలియకపోతే ఎలా అని ఆయన విమర్శ చేశారు.(నిజానికి నా ఉద్దేశం అంతకు ముందు పరిస్థితి) సరే ఇంతలో రజనీ కాంత్ అయితే రామోజీ ఫిలిం సిటీ భూమిపై కూడా ఆరోపణలున్నాయి కదా దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని పోరాడతారా అని ఆయన అడిగారు. అక్కడ నిజంగా కబ్బా జరిగినట్టు నిరూపించే మొనగాడుంటే తప్పక చేస్తామని తనదైన శైలిలో కెసిఆర్ ఫోన్లోనే ప్రకటించారు. వాస్తవంగా జరిగింది ఇది. తర్వాత కూడా ఇలాటి తరహాలోనే వ్యాఖ్యలు చేశారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక ఫిలింసిటీ సందర్శించడమే గాక అక్కడ దాదాపు ఒక పూట గడిపి ప్రశంసలు కురిపించి వచ్చారు. ఫిలింసిటీ నగరానికి ఆభరణమన్నట్టు మాట్టాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వారి వార్తల ప్రచురణ పట్ల ఈనాడు సంస్తల వైఖరి కూడా కనిపిస్తూనే వుంది. కనుక 3000 ఎకరాలు ఓం నమశ్శివాయ తప్పదేమో!