హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో ఉన్న చినజీయర్ ఆశ్రమంలో జరగనున్న రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదివారం ప్రత్యేకంగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. అప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా ఏం చేయాలోఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. క్షణం పాటు కరెంట్ పోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డికి అక్కడిక్కడే ఆదేశాలిచ్చారు.
రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగే కార్యక్రమాలన్నింటికీ అవసరైన నీటిని మిషన్ భగరీథ నీరు అందించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. యాగశాల వద్ద ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఏ చిన్న లోపం తలెత్తకూడదని స్పష్టం చేశారు.
చినజీయర్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ ప్రైవేటు కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాలంటే ప్రభుత్వానికి తగినంత రుసుములు కట్టి దరఖాస్తు చేసుకుని సౌకర్యాలు పొందాల్సి ఉంటుంది. కానీ చినజీయర్ పలుకుబడి వేరే రేంజ్లో ఉంటుంది కాబట్టి స్వయంగా సీఎం రంగంలోకి దిగి అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ కార్యక్రమంలాగా భావించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందర్నీ చినజీయర్ ఆహ్వానించారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమం జరగనుంది.