రైతుబంధు స్థానంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్ ను ఐదు ఎకరాలకు పరిమితం చేయనుందా..? అసలైన రైతులకు మాత్రమే సర్కార్ సాయం అందాలంటున్న సీఎం రేవంత్ వ్యాఖ్యల అంతరార్ధం ఇదేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రుణమాఫీతో పాటు రైతు భరోసాపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. రైతుబంధు కింద బీఆర్ఎస్ సర్కార్ ఎకరాకు పదివేలు ఇవ్వగా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరాకు 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ పథకం అమలుపై దృష్టిసారించింది. అయితే, ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనుకుంటున్నామన్న రేవంత్…అందరి సలహాలు, సూచనలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో అర్హత లేని వారికి రైతు బంధు ఇచ్చారని… శ్రీమంతులు, ఫామ్ హౌజ్ ఓనర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి సైతం లబ్ది చేకూర్చన్నారు. కాంగ్రెస్ హయాంలో అలాంటి వాటికీ చోటు లేకుండా పారదర్శకంగా రైతు భరోసా స్కీమ్ ను అమలు చేస్తామని రేవంత్ వ్యాఖ్యానించడం పట్ల చర్చ జరుగుతోంది.
రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్లు చెప్పిన రేవంత్…జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందన్నారు. ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని తెలిపారు. దీంతో రైతు భరోసా అమలుపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్లుగా ఐదు ఎకరాలకు పరిమితం చేస్తారా..? లేదంటే రైతులు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే వాటికీ మాత్రమే రైతు భరోసా ఇస్తారా…? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. కానీ, గతంలోలా నిరూపయోగంగా ఉన్న భూములకు మాత్రం రైతుభరోసా ఇచ్చే అవకాశం లేదని కేబినెట్ సమావేశం అనంతరం రేవంత్ వ్యాఖ్యలతో స్పష్టమైంది.