తెలుగు రాష్ట్రాల మధ్య తరచూ కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, హైకోర్టు విభజనకు తోడు ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే, ఫైళ్ల విభజన.
అమరావతి తాత్కాలిక రాజధాని నుంచి పరిపాలన సాగించడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. సచివాలయాన్ని తరలించడానికి కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఫైళ్లను కూడా తరలించాల్సి ఉంది. అయితే ఈ విషయంలోనే తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. కాన్ఫిడెన్షియల్ ఫైళ్ల విభజన కోసం ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేయాలని కోరుతోంది. గవర్నర్ జోక్యం చేసుకోవాలని విన్నవిస్తోంది.
ఉమ్మడి ఏపీలో తెలంగాణ, సీమాంధ్రకు చెందిన ఫైళ్లున్నాయి. అవన్నీ సచివాలయంలో భద్రంగా ఉన్నాయి. వాటన్నింటినీ అమరావతికి తరలిస్తామంటే కుదరదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్తోంది. రాష్ట్ర విభజనకు ముందు 3 లక్షల 35 వేలకు పైగా ఫైళ్లుండేవి. విభజన తర్వాత వీటిలో ఏపీకి లక్షా 31 వేలకు పైగా ఫైళ్లను కేటాయించారు. తెలంగాణకు లక్షా 20 వేలకు పైగా ఫైళ్లు వచ్చాయి.
రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఫైళ్లు దాదాపు 80 వేలున్నాయి. వీటిలో రెండు రాష్ట్రాలకూ సంబంధించిన కీలక వివరాలు, విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటిని అమరావతికి తరలించడాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అంశాల వారీగా ఫైళ్లను రెండు రాష్ట్రాలకు విభజించాలని పట్టుబడుతోంది.
భూమి కేటాయింపు, పారిశ్రామిక విధానం, రాయితీలు, పారిశ్రామిక అభివృద్ధికి ఇచ్చిన రాయితీలు వగైరాలకు చెందిన ఈ ఫైళ్లు రెండు రాష్ట్రాలకూ చెందినవి. వీటిలో చాలా వరకు రహస్యం లేదా కాన్ఫిడెన్షియల్ ఫైళ్లే. అతి ముఖ్యమైన ఫైళ్ల విషయంలో ఒకరి పెత్తనం ఏమిటనేది తెలంగాణ ప్రభుత్వ ప్రశ్న. వీటిని ఏకపక్షంగా అమరావతికి తరలించడం వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సింది గవర్నరే అనేది కేసీఆర్ సర్కార్ ఉద్దేశం. మరి గవర్నర్ స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.