తెలంగాణ… అంతా బాగుందనేది పైపైకి కనిపిస్తున్న భావన. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందనీ, విశ్వనగర విస్తరణ జరుగుతోందనీ, ఉద్యోగాల కల్పనకు పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందనీ, బంగారు తెలంగాణ సాధనకు బాటలు పడుతున్నాయని చెబుతున్నారు. అంతా పాజిటివ్ ప్రచారమే…! సాధారణంగా అధికారంలో ఉన్నవారు ఎవరైనా ఇదే చేస్తారు. వాస్తవాలేంటీ అనేది వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. కానీ, తెలంగాణలో ప్రతిపక్షాలకు ఆ స్థాయి స్వరమే లేకుండా చేశారు! వాస్తవంగా ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటీ… అభివృద్ధి పేరుతో రాష్ట్రం ఎటువైపు పయనిస్తోందనేది విపక్షాలే ప్రజలకు విడమరచి చెప్పాలి. సుప్తచేతనావస్థలో ఉన్న పార్టీలు ఎలాగూ ఆ పని చెయ్యలేవు..! వాస్తవం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్రం రానురానూ అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందన్నది!
ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతోంది కేసీఆర్ సర్కారు. ఈ ఏడాది ఇప్పటికే రూ. 21 వేల కోట్లు కొత్త అప్పులు తెచ్చేసిందట! అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం రూ. 10 వేల కోట్లు అప్పులు తెచ్చింది. ఆ తరువాతి ఏడాది మరో రూ. 16 వేల కోట్లను రుణాలుగా తీసుకొచ్చింది. మొత్తంగా దాదాపు లక్ష కోట్ల అప్పుల్ని దాటేసింది..! ఇంకా రెండు సంవత్సారాలు సమయం ఉంది. అంటే, మరో లక్ష కోట్ల అప్పులకు ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది.
భవిష్యత్తులో ఆదాయం అద్భుతంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు అప్పులు చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. కానీ, వాస్తవంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందేం లేదనే అంటున్నారు నిపుణులు. వస్తున్న ఆ కాస్త ఆదాయంలో చాలా వరకూ వడ్డీలు చెల్లింపులకే సరిపోతున్నాయట. మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చేసిన భారీ అప్పుల వల్ల అంతిమంగా భారం పడేది సామాన్యుడి పైనే.
అప్పులు తేవడం తప్పు కాదు! కానీ, ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ కోల్పోయే దిశగా రాష్ట్రం పయనిస్తోందన్నది నిపుణుల ఆందోళన. నోట్ల రద్దు కారణంగా పారిశ్రామిక ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే, మొదట్లో కేసీఆర్ ఇలానే ఆవేదన వ్యక్తం చేసినా… ఆ తరువాత, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ టాపిక్ గురించి ఆయనా మాట్లాడటం మానేశారు. అంతమాత్రాన అప్పుల బాగోతం బయటకి రాకుండా ఉంటుందా..? బంగారు తెలంగాణ సంగతేమోగానీ… ప్రస్తుతం వస్తున్న ఆదాయమంతా వడ్డీల చెల్లింపులూ, పెరిగిన ప్రభుత్వోద్యోగుల జీతాలకే సరిపోవడం గగనమౌతోందట! అభివృద్ధిలో గుజరాత్ తరువాతి స్థానంలో ఉందని చెప్పుకున్న రాష్ట్రం పరిస్థితి ఇలా ఎందుకు మారుతోందో…?