హైకోర్టు డెడ్ లైన్ పెట్టినప్పుడు ఇక తప్పదనుకున్నప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టిన తెలంగాణ సర్కార్.. మరోసారి అదే హైకోర్టు నుంచి ఖచ్చితమైన ఆదేశాలు వస్తాయని అంచనా రావడంతో వెంటనే … లాక్ డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకూ అనుమతి ఇస్తారు. తర్వాత అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఉదయం తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో ధర్మాసనం సర్కార్ తీరుపై విరుచుకుపడింది. లాక్డౌన్ విధిస్తారా?, నిబంధనలు కఠినతరం చేస్తారా అని సూటిగా ప్రశ్నించింది.
సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపడంపైనా మండిపడింది. దీంతో మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని… అందులో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు చెప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం రెండున్నరకు హైకోర్టులో మళ్లీ విచారణ ప్రారంభమయింది. ఈ లోపే ప్రభుత్వ వర్గాలు లాక్ డౌన్ విషయాన్ని మీడియాకు వెల్లడించాయి. ఇదే విషయాన్ని హైకోర్టులో వాదనలు ప్రారంభమన వెంటనే.. ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కరోనా కట్టడిలో భాగంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
దేశంలో అన్ని రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ లేదా.. పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఒక్క తెలంగాణలో మాత్రం.. నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ వల్ల ఉపయోగం ఉండదని.. కేసులు కూడా తగ్గవని.. కానీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు.. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో కేసీఆర్ నిర్ణయం తీసుకోక తప్పలేదు.