కరోనా విషయంలో నిర్లిప్తంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశాలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని.. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ర్యాపిడ్ యాంటీజెంట్ టెస్ట్ నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించిందని హైకోర్టు గుర్తుచేసింది. ఐసీఎంఆర్ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని… స్పష్టం చేసింది. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే కాదని.. మరో 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు అందిస్తున్నామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
అయితే.. గాంధీతో పాటు 54 ఆస్పత్రుల్లో.. కరోనా చికిత్సలు జరుగుతున్నాయని ప్రచారం చేయాలని సూచించింది. సంచార పరీక్షలు ఎందుకు వీలుకాదో ప్రభుత్వం చెప్పాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందితోపాటు పోలీసులకు రక్షణ కిట్లు ఇవ్వాలని.. సిబ్బందికి షిఫ్ట్‌ల విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 29లోగా నివేదిక సమర్పించాలని ఆర్డర్స్ పాస్ చేసింది. పెద్దఎత్తున వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాగే.. టెస్టులు సరిగ్గా చేయడం లేదన్న విమర్శలు ఎదురవుతున్నాయి.
వీటన్నింటి కారణంగా హైకోర్టు.. ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ..స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు మృతదేహాలకు కూడా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అలా చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకు వచ్చింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందో.. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తుందో వేచి చూడాలి..!