ఆర్టీసీ కార్మికుల ఐదు డిమాండ్లను పరిష్కరించడానికే రూ. 46 కోట్లు ఖర్చవుతుందని.. కానీ ఆర్టీసీ వద్ద.. కేవలం పది కోట్ల రూపాయలే ఉన్నాయని… తెలంగాణ సర్కార్ హైకోర్టులో వాదించింది. చర్చలు జరపాలని వారం క్రితం హైకోర్టు ఆదేశించి… 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ వాయిదాలో చర్చలు జరిపినట్లుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ అంశంపై హైకోర్టులోనూ ఇరువర్గాలు.. తమదైన వాదన వినిపించాయి. ప్రభుత్వానికి చర్చలు జరపాలన్న ఉద్దేశం ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమైతే.. ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. మొదట.. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు వాదించారు. ఆయనపై ధర్మాసనం మండిపడింది. ప్రభుత్వం తరుపున ఏజీ మాత్రమే వాదనలు వినిపించాలని ఆదేశించింది. దాంతో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు హాజరయ్యారు.
ఆర్టీసీ వద్ద నిధుల్లేవన్న విషయంపై వాదనలు జరుగుతున్న సమయంలో.. ఆర్టీసీకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన నిధులపై.. ధర్మాసనం నివేదిక కోరింది. జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన 1,475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ నిధులు రూ.1,492 కోట్లు, కార్మికుల సేవింగ్స్‌పై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం వివరాలు ఇస్తామని.. ఎల్లుండికి విచారణ వాయిదా వేయాలని… ఏజీ ధర్మాసనాన్ని కోరారు. అయితే.. హైకోర్టు మాత్రం.. రేపే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని… 26 డిమాండ్లపై కచ్చితంగా చర్చించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఆర్ధికభారం పేరుతో ప్రభుత్వం చర్చలను వాయిదా వేస్తోదని… ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకనే ఆర్టీసీకి నష్టాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కార్పొరేషన్‌కు పూర్తిస్థాయి ఎండీని నియమిస్తే.. కార్మికులు తమ సమస్యలు చెప్పుకునే వారని ప్రభుత్వం అలా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. కార్మికుల సమస్యలపై ఆర్టీసీ వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. డిమాండ్లు సాధ్యంకాదని ముందుగానే నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించింది. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి ఎంత ఖర్చు అవుతుందో.. నివేదికలో ఎందుకు చెప్పలేదని ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మంగళవారం విచారణలో హైకోర్టు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై కీలక ఆదేశాలు జారీ చేస్తే.. సమ్మె అనూహ్య మలుపు తిరిగే అవకాశం ఉంది.