ఓ పక్క కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చే హడావుడిలో కేసీఆర్ సర్కారు ఉన్న సమయంలోనే, మరోపక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను ఎందుకంత హడావుడిగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారో చెప్పాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణకు సమయం ఉన్నా కూడా ఆదరాబాదరాగా ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నారంటూ అడిగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన దాఖలైన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తుండటం వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయనీ, దీని వల్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లుతున్నాయన్నాయనే అంశం తమ దృష్టికి వచ్చిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని సూటిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 109 రోజులు గడువు ఉంటేనే ఎన్నికలకు వెళ్తామంటూ న్యాయస్థానానికి గతంలో టీ సర్కారు కోరిందనీ, కానీ ఇప్పుడెందుకిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. మొత్తంగా ఓ 15 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేస్తామనీ, అభ్యంతరాల నివృత్తికి కూడా ఒక్కరోజే గడువు ఇస్తున్నారనీ, ఈ తొందర వల్ల కొన్ని చోట్ల ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఉండదనే అంశాలను గుర్తుచేసింది. ఈ సందర్బంగా తెలంగాణ సర్కారుతోపాటు, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలపై కౌంటర్ దాఖలు చేస్తామంటోంది టి.సర్కారు. అయితే, ప్రస్తుతం వ్యక్తమౌతున్న అభ్యంతరాలన్నీ పరిష్కరించాకనే ఎన్నికలకు వెళ్లాలంటూ జిల్లా కలెక్టర్లకు తాము సూచించామని ఎన్నికల సంఘం అంటోంది. ప్రభుత్వంతోపాటు, ఎన్నికల సంఘం కూడా కౌంటర్ దాఖలు చేయనుంది. ఈ కౌంటర్ల దాఖలు తరువాత కోర్టు ఎలాంటి కీలక తీర్పుని ఇవ్వనుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికలను త్వరగా నిర్వహించేద్దాం అనే ఆలోచనపై ఇప్పటికే కేసీఆర్ సర్కారు మీద భాజపా, కాంగ్రెస్ నేతల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ విమర్శల డోస్ మరింత పెరిగే అవకాశం ఉంది.