అసెంబ్లీ, సచివాలయానికి కొత్త భవనాలు కట్టాలని కేసీఆర్ ఎంత స్పీడ్‌గా వెళ్తున్నారో.. అంతే స్పీడ్‌గా స్పీడ్ బ్రేకర్లు ఎదురొస్తున్నాయి. గతంలో స్థలాలు దొరక్క.. ప్రణాళికలు పక్కన పెట్టారు. కేంద్రం ఊరించి.. ఊహించి ఊసూరుమనిపించింది. లక్కీగా..ఏపీలో సర్కార్ మారిపోయి.. సచివాలయ భవనాలు.. అక్కడి సీఎం ఇచ్చేయడంతో.. వాటిని కూల్చేసి.. అక్కడే కొత్త భవనాలు కట్టిద్దామని అఘమేఘాలపై ప్రణాళికలు బయటకు తీసి.. టెండర్లు పిలవడానికి రెడీ అయిపోతూంటే.. కొత్తగా కోర్టు కేసులు అడ్డం పడుతున్నాయి. తాము చెప్పే వరకూ.. భవనాలు కూల్చవద్దని.. హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దాంతో.. కూలగొట్టి .. కొత్తవి కట్టాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు గండి పడినట్లే కనిపిస్తోంది. సచివాలయ భవనాల కూల్చివేతలపై విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఉమ్మడి రాజధానిలో.. కట్టడాలపై గవర్నర్‌కు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుందని కూల్చివేతలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక కట్టడాలు 100 ఏళ్లు దాటితే.. వాటిని కూల్చడానికి వీల్లేదన్న రూల్స్ ను కోర్టుకు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సరిపోయిన భవనాలు.. ఇప్పుడెందుకు సరిపోవడం లేదని..పిటిషనర్ ప్రశ్నిస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే నూతన భవనాలుని పిటిషనర్ వాదించారు. ఇప్పటికే కూల్చివేతలపై.. కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో.. వీటన్నింటిపై నిర్ణయం వెలువడే సరికి చ చాలా సమయం పడుతుందని… అంటే.. ఇప్పటికైతే.. కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు బ్రేక్ పడినట్లేనన్న భావన ఏర్పడుతోంది.
మరో విపక్ష పార్టీలు కూడా కూల్చివేతను అడ్డుకోవడానికి .. ఏదైనా చేస్తామని చెబుతున్నాయి.ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత గవర్నర్ దే కాబట్టి ఆయన్ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. గవర్నర్ స్పందించకపోతే చలో రాజ్ భవన్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇక గవర్నర్ నే బాధ్యుడ్ని చేస్తూ రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు ఏక తాటిపైకి వచ్చి.. ఆదివారం రౌండ్ టేబుల్ భేటీ కూడా నిర్వహించాయి. ఎలా చూసినా… కేసీఆర్… కొత్త భవనాల విషయంలో ముందడుగు వేయాలంటే.. చాలా చిక్కుముళ్లు విప్పాల్సి ఉంటుంది.