ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఉపఎన్నికలు వస్తాయని బెదిరిస్తూ వస్తున్న కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హతా పిటిషన్ల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని హైకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్ ఎలాంటి గడువు విధించలేమని తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని వాదన తర్వాత తుది తీర్పు ఇచ్చింది. రీజనబుల్ టైం లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసింది.
గతంలో సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇలా ఆదేశించడం రాజ్యాంగ విరుద్ధమని స్పీకర్ ను న్యాయస్థానాలు ఆదేశించలేవని.. ఫిరాయింపుల నిరోధక చట్టంలో కూడా అదే ఉందని కోర్టులో వాదించారు. ఈ వాదనలకే హైకోర్టు సమర్థత లభించింది. నిజానికి న్యాయవ్యవస్థకు, స్పీకర్‌కు అధికారాల విభజన స్పష్టంగా ఉంటుంది. స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని రాజ్యాంగనిపుణులు చెబుతున్నారు.
కారణం ఏదైనా బీఆర్ఎస్ హయాంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా అనర్హతా వేటుపడలేదు. కాంగ్రెస్ హయాంలోనూ అంతే. స్పీకర్ నిర్ణయం మాత్రమే ఫైనల్. ఉపఎన్నికలు కావాలని అనుకుంటే రాజీనామాలు తీసుకుని ఆమోదిస్తారు కానీ అనర్హతా వేటు వేసే అవకాశం ఉండదు. మొత్తంగాహైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు వలసపోయే అవకాశాలకు మార్గం ఏర్పడినట్లయింది.