వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా… లొంగలేదని తన తండ్రిపై దాడి చేశారని .. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడని సీబీఐ వాదించింది. ఆయన పవర్ ఫుల్ వ్యక్తి అని ఆయన వెనుక చాలా మంది ఉన్నారని బయట ఉంటే సాక్ష్లుల ప్రాణాలకు గ్యారంట ఉండదని.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అవినష్ రెడ్డి తరపు లాయర్ల వాదలను విన్న హైకోర్టు వారితో ఏకీభవించి దస్తగిరి పిటిషన్ ను కొట్టి వేసింది.
అంతే కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. అంటే అవినాష్ రెడ్డి సాంకేతికంగా అరెస్టు అయి.. ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లకుండా బెయిల్ పై ఉన్నారు. ఆయన తండ్రి అరెస్టు అయినా మధ్యలో కొన్నాళ్లు వైద్యం కోసం బెయిల్ తెచ్చుకుని.. ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పటికే శివశంకర్ రెడ్డికి కూడా బెయిల్ వచ్చింది.
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటూ.. కడప కోర్టు ఇచ్చిన తీర్పుతోనే పెద్ద ఊరట లభించింది. ఇప్పుడు వరుసగా బెయిల్స్ రావడం మరింత సంతోషపరుస్తోంది. ఎన్నికల వరకూ.. అవినాష్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేనట్లే. తర్వాత మారే ప్రభుత్వాలను బట్టి కేసు ముందుకు సాగుతుంది. న్యాయం కోసం షర్మిల , సునీత కొంగు పట్టుకుని అర్థిస్తున్నారు.