తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రేవంత్‌రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని చెప్పారు. రేవంత్ లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించి కేసు కొట్టివేసింది.
రేవంత్ అప్పటికి పీసీసీ చీఫ్ గా కూడా లేరు. ఆయన పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో .. ఓ రోజు మీడియాను పిలిచిన రేవంత్ అప్పటికప్పుడు ఓ కీలకమైన ప్రదేశానికి తీసుకెళ్తానని .. మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లారు. జన్వాడలోని కేటీఆర్ దిగా చెబుతున్న ఫామ్ హౌస్ ను చూపించారు. డ్రోన్ ఎగురవేసి లోపల దృశ్యాలను చూపించారు. పోలీసులు అప్పుడు ఆయనను అరెస్టు చేశారు. చాలా రోజులు జైల్లో ఉన్నారు. కరుడు గట్టిన నేరస్తుల మధ్య ఉంచారని ఈ కేసు గురించి రేవంత్ చాలా సార్లు గుర్తు చేసుకున్నారు.
జన్వాడ ఫామ్ హౌస్ అప్పట్లో కేటీఆర్ ది కాదని బీఆర్ఎస్ నేతలు వాదించారు. తర్వాత ఆయన లీజుకు తీసుకున్నారని చెప్పారు. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ను కూల్చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే కొలతలు తీశారు కానీ.. కూల్చివేతల వరకూ నిర్ణయం తీసుకోలేదు. ప్రజా వ్యతిరేకత వస్తుందన్న కారణంగా వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. అదే జన్వాడలో కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ పార్టీ కూడా వివాదాస్పదం అయింది.