ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను తేల్చే విషయంలో తెలంగాణ హైకోర్టు చాలా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తోంది. హైదరాబాద్ సీబీఐ కోర్టులలో ఉన్న కేసులను తొమ్మిది నెలలలో విచారణ పూర్తి చేయగలమని సుప్రీంకోర్టుకు స్పష్టంగా తెలిపింది. అమికస్ క్యూరీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదిక ద్వారా సమర్పించారు. తెలంగాణ హైకోర్టు కార్యాచరణ ప్రణాళికను మిగతా అన్ని హైకోర్టులు ఆదర్శంగా తీసుకోవాలని అమికస్ క్యూరీ కూడా సిఫార్సు చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో అత్యధికం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన కేసులే ఉన్నాయి. వీటికి సంబంధించిన కేసుల పురోగతిపై పూర్తి సమాచారం తీసుకున్న తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తొమ్మిది నెలల్లో విచారణ పూర్తి చేయవచ్చని చెప్పినట్లుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఎనిమిదేళ్ల నుంచి విచారణ ప్రారంభం కాలేదు. కొన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. కొన్ని కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు విచారణలో ఉన్నాయి. అయితే..సీబీఐ దాదాపుగాఅన్నింటిలోనూ చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈడీ కూడా… చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటన్నింటిపై అసలు విచారణ ప్రారంభమైతే.. త్వరగా కేసులు తెలిపోయే అవకాశం ఉంది. అందుకే.. తొమ్మిది నెలల్లో విచారణ పూర్తి చేస్తామని తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చినట్లుగా న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.
నేర చరితుల్ని రాజకీయాల నుంచి తుడిచేస్తేనే రాజకీయ వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉందని చాలా కాలంగా మేధావులు వాదిస్తూ వస్తున్నారు. క్రిమినల్ మైండ్‌తో ఉండే నేతలు రాజకీయ అధికారం పొందడం వల్ల రాజ్యాంగ ఉల్లంఘనలు జరగడమే కాకుండా.. చట్టాలు, రాజ్యాంగాలను సైతం ధిక్కరించేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలహీనం చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు చొరవతో.. రాజకీయలు.. తొమ్మిది నెలల్లో క్లీన్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆశాభావం ప్రజల్లో కనిపిస్తోంది.