ఈడీకి సంపూర్ణ అధికారాలు ఉన్నాయని.. కేసులు పెట్టి అరెస్ట్ చేయవచ్చని.. సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పుపై భిన్నభిప్రాయాలున్నాయి. రివ్యూ పిటిషన్ కూడా కొంత మంది వేశారు. అయితే తెలంగాణ హైకోర్టు జగన్ కేసుల్లో ఇచ్చిన ఓ తీర్పుతో ఈడీకి ఉన్న పవర్‌కు కోత పడినట్లయింది. ఈ తీర్పు వల్ల ఒక్క జగన్‌కే కాకుండా ఈడీ బారిన పడిన ఎంతో మంది రాజకీయ నేతలకు ఊరట లభించనుంది.
సీబీఐ కేసులు తేలిపోతే ఈడీ కేసులూ ఉండవన్న తెలంగాణ హైకోర్టు !
అసలు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పేమిటంటే… సీఎం జగన్‌పై ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ ఛార్జిషీట్లపైనే తేల్చాలని … ఆ కేసులు వీగిపోతే ఈడీ కేసులు కూడా ఉండవని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెల్లడించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో 11 సీబీఐ, 9 ఈడీ ఛార్జిషీట్లపై హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కేసులూ సీబీఐ విచారణ తర్వాతే !
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక్క జగన్ అక్రమాస్తుల కేసుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దూకుడు చూపిస్తున్న ఈడీకి షాక్ ఇచ్చినట్లయింది. సాధారణంగా ఈడీ నేరుగా కేసులు దాఖలు చేయలేదు. సీబీఐ లేదా ఐటీ అధికారులు నమోదు చేసే కేసుల వివరాలు తీసుకుని అందులో మనీలాండరింగ్ ఉంటే కేసులు నమోదు చేస్తుందిఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముందు సీబీఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులోనూ సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ చేయాల్సి ఉంటుంది. . ఇప్పుడుహైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అలాంటి కేసులన్నీ …సీబీఐ లేదా ఐటీ విచారణ పూర్తయిన తర్వాత.. అందులో నేరం చేశారని తేలితేనే ప్రోసీడ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఈడీ కేసులు కూడా తేలిపోతాయి. ఇలా దేశంలో జగన్ లాంటి ఎంతో మంది రాజకీయ నేతలకు .. ఇతరులకు తెలంగాణ హైకోర్టు తీర్పు ద్వారా ఊరట లభించనుంది.
రెండూ వేర్వేరు నేరాలని సీబీఐ, ఈడీ వాదన – అంగీకరించని హైకోర్టు !
సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసులపై విచారణ ప్రారంభించాలని గతంలో సీబీఐ కోర్టును ఈడీ కోరింది. సీబీఐ కేసులు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని.. ఈడీ మాత్రం అక్రమంగా నగదు చెలామణి చేశారన్న కేసులు నమోదు చేసిందని తెలిపారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసులను విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు ఈడీ వాదనను తిరస్కరించి నిందితులయిన జగన్, విజయసాయిరెడ్డి వాదనలతో ఏకీభవించింది.