ఆర్టీసీ కార్మికుల సమ్మెపై వాదోపవాదాలు కోర్టులో కొనసాగుతున్నాయి. సమ్మె విరమించమంటూ కార్మికులను తాము ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎందుకంటే, ఈ సమ్మె ఇల్లీగల్ అని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో కొన్ని వేల మంది ఉద్యోగుల కెరీర్లను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, రెండు వర్గాలనూ దృష్టిలో పెట్టుకుని ఇలా స్పందిస్తున్నట్టు కోర్టు చెప్పింది. ఇవాళ్టి వాదనల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ విభజన అంశం ప్రస్థావనకు వచ్చింది. ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్ వాదన వినిపిస్తూ… ఆర్టీసీ విభజన అంశం ఇంకా కేంద్రం దగ్గరే పెండింగ్ లో ఉందన్నారు. ఆర్టీసీకి రీఎంబర్స్ మెంట్ బకాయిలు దాదాపు వెయ్యి కోట్లు ఉన్నాయనీ, వీటిలో 42 శాతం తెలంగాణ, 58 శాతం ఆంధ్రా చెల్లించాల్సి ఉందన్నారు. అయితే, బకాయిలపై ఎల్లుండిలోగా నివేదిక ఇవ్వాలంటూ ఇన్ ఛార్జ్ ఎండీని కోర్టు ఆదేశించింది. ఇవాళ్టి వాదనల్లో కూడా సమ్మె విరమణ విషయమై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. తదుపరి విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.
ఇక, సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ ఉద్యోగుల జీతాల చెల్లింపులపై కూడా స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. నాలుగు డిమాండ్లుకు సంబంధించిన రూ. 45 కోట్లు చెల్లింపు అంశంపై కూడా ప్రముఖంగా వాదనలు జరిగాయి. ఈ సందర్భంలో… హుజూర్ నగర్ నియోజక వర్గానికి అక్కడి ప్రజలు అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 100 కోట్ల వరాలు కురిపించారనీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఆర్టీసీకి ఇవ్వడానికి రూ. 45 కోట్లు ప్రభుత్వం దగ్గర లేవా అనే ప్రశ్నకు… ప్రభుత్వం తరఫు నుంచి అడ్వొకేట్ జనరల్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం విశేషం! ఇంకోటి… సరూర్ నగర్లో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తామన్న సమ్మెకు ప్రభుత్వం నుంచి అనుమతు లేవు. దీనిపై కోర్టులో కార్మికులు అనుమతులు కోరితే… కొన్ని షరతులతో సభ నిర్వహణకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బకాయిలకు సంబంధించిన నివేదికను ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ కోర్టుకు సమర్పించడం వల్ల ఇప్పుడు పరిస్థితుల్లో ఏమైనా తేడా వస్తుందా అంటే, ఏమీ ఉండదనే అంటున్నారు కొంతమంది న్యాయవాదులు. ఎందుకంటే, ఇప్పటికే ఆర్టీసీకి చాలా ఇచ్చేశామని ప్రభుత్వం అంటోంది, ఇంకా ఇవ్వాల్సిన అవసరమే మాకు లేదని చెబుతోంది. ఆ నంబర్ల వల్ల కేసు పురోగతిలో మార్పు ఉండదని అంటున్నారు. మొత్తానికి, సమ్మెకు సంబంధించి ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ వెనక్కి తగ్గిన దాఖలాలైతే లేవు. శుక్రవారం నాటి వాదనలు ఎలా ఉంటాయో, అంతిమంగా కోర్టు ఆదేశాలు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే