హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో కూల్చివేతలపై పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ , అమీన్ పూర్ తహశీల్దార్ లపై కోర్టు సీరియస్ అయింది.
ఆదివారం కూడా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు న్యాయమూర్తి గుర్తు చేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనం ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి…భవనాన్ని 48గంటల్లో ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చి 40గంటల్లో ఎలా కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తహశీల్దార్ సూచనలతోనే కూల్చివేతలు చేపట్టామని రంగనాథ్ హైకోర్టుకు వివరించారు. తహశీల్దార్ చెబితే వెంటనే చర్యలు తీసుకుంటారా?మీకంటూ పాలసీ ఉండదా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చెబితే చార్మినార్ , హైకోర్టును కూడా కూల్చివేస్తారా? అని హైడ్రా కమిషనర్ ను ప్రశ్నించింది.
నేతల మెప్పు కోసం, ఉన్నాతాధికారుల ప్రాపకం కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరించవద్దు..అధికారులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది జాగ్రత్త అంటూ హైకోర్టు హెచ్చరించింది. చెరువులోకి నీళ్లు వెళ్లకపోవడంపై అధ్యయనం చేస్తున్నారా? అసలు విషయాలను వదిలేసి కూల్చివేతలు చేపడుతారా? చట్ట వ్యతిరేకంగా పని చేసే వాళ్లను చర్లపల్లి జైలుకు పంపిస్తే తెలుస్తుంది అంటూ కోర్టు సీరియస్ అయింది.