కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుబట్టిన కోర్టు.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు.
బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఒక విధమైన కబ్జానే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానంలో భాగంగా అన్ని కుల సంఘాలకూ భూములు కేటాయించి ఆత్మగౌరవ భవానాలు నిర్మిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు బిసి కులాల కోసం 135 ఎకరాలను మూడు చోట్ల కేటాయించింది. ఇతర కులాలకూ భూములు కేటాయించారు. ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అన్ని కులాలకూ కేటాయిస్తున్నట్లే వెలమ, కమ్మ సామాజికవర్గాలకు కేటాయించామని ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే వెనకుబడిన కులాకు ఇవ్వడం సమర్థనీయమే కానీ.. ఉన్నత కులాలకు ఇవ్వాల్సిన ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కమ్మ, వెలమ కులాల భవనాలకు అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు పొందిన హైటెక్ సిటీ ప్రాంతంలోని ఖానామెట్‌లో భూములు ఇచ్చారు. ఇక్కడ ఎకరం యాభై కోట్లుపైనే ఉంటుందని చెబుతున్నారు. అయితే కులాలకు ఇచ్చామంటే అర్థం.. ఆ కులాల్లో నిరుపేదలకు ఎంతో కొంత సాయం చేయడానికేనని ప్రభుత్వం వాదిస్తోంది.