ఏప్రిల్ మొదట్లో ప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్… గాంధీలో 50 మందిలోపే కరోనా రోగులున్నారని.. వారు బాగా కోలుకుంటున్నారని… మరో పది రోజుల్లో కరోనా ఫ్రీ స్టేట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అలా అన్న రోజే.. తబ్లిగీ కేసులు బయటకు వచ్చాయి. ఆ రాత్రే ఆరుగురు చనిపోయారు. ఆ ఉధృతి అలా కొనసాగింది. మళ్లీ ఇటీవల “కరోనా ఫ్రీ స్టేట్” అనే ఆశల్ని తెలంగాణ సర్కార్ మోసుకెళ్తోంది. దీనికి కారణం పాజిటివ్ కేసులు అంతకంతకూ తగ్గిపోవడమే. సోమవారం తెలంగాణలో రెండు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కావడంతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయం మే 7వ తేదీ ముగిసే సరికి.. కరోనా ఫ్రీ స్టేట్‌గా తెలంగాణ ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని… తర్వాత ఏదైనా ఉత్పాతం వచ్చి పడినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.
తెలంగాణలో గత నాలుగు రోజులుగా.. చాలా పరిమితంగా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో తెలంగాణ అధికారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అక్కడక్కడా జరిగిన తప్పిదాలతో కేసుల సంఖ్య పెరిగినా.. పకడ్బందీగా స్పందించి.. వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో.. ముప్పు తప్పిందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో ఏర్పడింది. పాజిటివ్ కేసులు పూర్తిగా కంట్రోల్ కాకపోయినా… భారీగా పెరిగే అవకాశం లేదన్న అంచనాకు మాత్రం అధికారులు వచ్చారు. అందుకే.. లాక్ డౌన్ సమయం పూర్తయ్యే మే 7వ తేదీలోపు… అంతా సర్దుకుంటుందని నమ్ముతున్నారు.
తెలంగాణలో కొత్త కేసులు కంటెయిన్మెంట్ జోన్ల నుంచే వస్తున్నాయి.. పాత కేసులు ఉన్న చోట… కంటెన్మెంట్ జోన్లను తొలగిస్తున్నారు. ఇలా.. మే 7వ తేదీ కల్లా కంటెయిన్మెంట్ జోన్లను చాలా పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఇదే పట్టును కొనసాగించాలని … లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేసులు తగ్గుతున్నాయి కదా అని నిర్లక్ష్యం చేయవద్దని.. పూర్తి స్థాయిలో.. తగ్గుముఖం పట్టేవరకు ప్రస్తుత పంథానే పకడ్బందీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.