నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అంటూ చడామడా తిట్టారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎవరినైనా బలిచేస్తారని, హరికృష్ణ మరణంపై కూడా చంద్రబాబు రాజకీయాలు చేశాడని, ప్రజలకు ఏమీ చేయకుండా కేవలం మీడియా ప్రచారాలను అడ్డం పెట్టుకొని ఇంతకాలం బతికారని, తెలంగాణ ప్రజలు చంద్రబాబుకి ఎన్నికల్లో బుద్ధి చెప్పినందుకు ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలను అభినందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ని కెసిఆర్ తిట్టిన ఈ కథనాన్ని ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్ లోను, హైదరాబాద్ ఎడిషన్ లోనూ, మొదటి పేజీలో బ్యానర్ స్టోరీ గా ఇచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ఎడిషన్ మొదటి పేజీలో ఈ వార్త ని విస్మరించారు. బ్యానర్ స్టోరీగా కాకపోయినా కనీసం మొదటి పేజీలో ఏదో ఒక చోట ఈ వార్తను ప్రస్తావిస్తారు అనుకుంటే దాన్ని రెండవ పేజీ కి షిఫ్ట్ చేసింది ఈనాడు. రెండవ పేజీలో కూడా కేసీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ఎంత స్పేస్ ఇచ్చిందో, అంతే స్పేస్ కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకి ఇచ్చి కథనాన్ని ప్రచురించింది.
ఈనాడు వైఖరి తెలుగుదేశం పార్టీకి పక్షపాతం చూపించేలా ఉందని, రోజు రోజుకి ఈనాడు పై ఉన్న గౌరవం తగ్గిపోతోందని పాఠకులు అభిప్రాయపడుతున్నారు. పోనీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కి సంబంధించిన వార్త మొదటి పేజీలో ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుందామా అంటే, అదే మొదటి పేజీలో తమిళనాడు ప్రతిపక్ష నేత అయిన స్టాలిన్ చంద్రబాబు కి రాసిన లేఖ సంబంధించిన కథనాన్ని మొదటి పేజీలో అందించింది. ఈ కథనం కూడా చంద్రబాబుకు కాస్త అనుకూలంగా ఉండేదే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే రెండవ పేజీలో చంద్రబాబు కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యల కి ఇచ్చినంత స్పేస్, తెలుగుదేశం నేతల కౌంటర్లకు కూడా ‘ఈనాడు’ ఇచ్చింది. ఇందులో పెద్దగా తప్పుపట్టాల్సిన పని లేకపోయినప్పటికీ, మిగతా పార్టీల మీద నెగటివ్ కథనాలు ప్రచురించేటప్పుడు కూడా ఈనాడు ఇదే వైఖరి పాటించి వారి కౌంటర్లకు కూడా అలాగే సమానమైన స్పేస్ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ మధ్యన అన్ని చానల్స్ , అన్ని పత్రికలు ముసుగు తీసి వేసి తమకు కావాల్సిన పార్టీకి బాహాటంగానే మద్దతు ఇస్తున్నాయని, ఎంతో కొంత తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోంది అనుకునే ‘ఈనాడు’ కూడా ఇప్పుడు ఈ కోవలోకి చేరిపోయిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా ఇటువంటి సిత్రాలు మరిన్ని చూడవలసి వస్తుందేమో!!
– జురాన్